Monday, December 23, 2024

ముక్కలు ముక్కలుగా…!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: విశ్వమే యుగళ గీతం, జంట నాట్యం, స్త్రీ పురుష సంగమం సమాగమం. ఇద్దరూ సమానంగా, సంతోషంగా కలిసి మెలిసి సాగినప్పుడే ప్రకృతికి న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మానవాళి సుఖంగా, సుభిక్షంగా వుంటుంది. కాని జరుగుతున్నది ఇందుకు పూర్తి విరుద్ధం. పురుషాధిక్యత, ఆధిపత్యాల వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా స్త్రీని ద్వితీయ శ్రేణిలో వుంచి, పురుషుడి చేతి కిందనే కొనసాగిస్తున్నది. దీని వల్ల ఈ ఆధునిక కాలంలోనూ స్త్రీపై పురుష హింస నానాటికీ పెచ్చరిల్లడమే కాదు, కొత్త కొత్త వికృత భయానక పోకడలు పోతున్నది. ప్రియురాలిని వధించడమే కాకుండా ముక్కలుముక్కలుగా నరికి పోగులుపెడుతున్నారు, ఆ పోగులను దశదిశలా వెదజల్లుతున్నారు.

ఇటువంటి సంఘటనలు దేశంలో ఇటీవల వరుసగా రెండు సార్లు జరగడం ఆందోళనకరం. ఇందులో ఒకటి ఢిల్లీలో జరగ్గా, మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌ఘడ్‌లో సంభవించింది. ఢిల్లీ ఉదంతంలో అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) అనే వ్యక్తి శ్రద్ధావాకర్ అనే తన ప్రియురాలిని గత మే 18న పొడిచి చంపి మృత దేహాన్ని 35 ముక్కలు చేసి ఒక చిన్న ఫ్రిజ్‌లో భద్రపరచి ఆ తర్వాత 18 రోజుల్లో రోజుకు కొన్ని ముక్కలుగా అక్కడి మెహ్రాలి అడవిలో పాతిపెట్టాడు. ఈ ఉదంతం ఈ నెల 8వ తేదీన బయటకు రాగా ఢిల్లీ పోలీసులు నిందితుడు పూనావాలాను అరెస్టు చేశారు.

అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. అఫ్తాబ్, శ్రద్ధ బొంబాయిలో ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తున్నప్పుడు ప్రేమించుకున్నారు. వారి వివాహానికి శ్రద్ధ కుటుంబం అంగీకరించకపోడంతో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ మెహ్రాలి ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో సహజీవనం సాగిస్తూ వచ్చారు. పెళి చేసుకొనే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో అఫ్తాబ్ ఆమెను చితకబాదడం మొదలుపెట్టాడు. చివరికి ఆమెకు సమాధానం చెప్పలేక ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ ఘటనలో ప్రిన్స్ అనే వ్యక్తి తన ప్రియురాలైన 22 ఏళ్ళ ఆరాధనను తన సమీప బంధువు సర్వేశ్ సహకారంతో చంపివేసి ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. తలిదండ్రులు వేరొకరితో ఆమెకు పెళ్ళి చేయడంతో ఆగ్రహించిన ప్రిన్స్ ఆమెను పిలిచి భర్తను వదిలి పెట్టాలని కోరాడు. అందుకు నిరాకరించడంతో ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ఆమె తలను వేరొక చోట పారవేసి మొండాన్ని ఒక బావిలో పడేశాడు. మహిళలపై ఇటువంటి ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయి. కాకపోతే ఢిల్లీ, యుపి ఉదంతాల్లో దుండగులు వారిని చంపి వేసిన తర్వాత కూడా మృత దేహాలను ముక్కలు ముక్కలుగా నరికివేశారు. ఈ పైశాచిక గుణం భయం కలిగిస్తున్నది. మనిషి ఎందుకింత అమానుషంగా తయారవుతున్నట్టు అనే ప్రశ్న తలెత్తుతున్నది. దీనికి సమాధనం చెప్పుకొనే ముందు స్త్రీ పురుష సంబంధాల్లో సమానత్వం, పరస్పర ప్రజాస్వామిక పరిగణన ఎందుకు చోటు చేసుకోడం లేదు అనే దానికి జవాబు చెప్పుకోవాలి. ఇద్దరికీ సమానమైన ఓటు హక్కు వుంది. ఇద్దరినీ ఒకే రకమైన ఆకలి పీడిస్తుంది. కాని ఒకరిది పైచేయి, ఇంకొకరిది కింది చేయి ఎందుకవుతోంది? ఈ అసమానత్వం మన సంప్రదాయక, సామాజిక ఏర్పాటు నుంచి వచ్చింది. దానిని సమర్థించే బలమైన వర్గం ఇప్పటికీ మన సమాజానికి సారథ్యం వహిస్తున్నది. కాని మన రాజ్యాంగం ఇద్దరికీ సమాన హక్కులిచ్చింది.

చివరికి నాలుగు గోడల మధ్య కలిసి బతికేటప్పుడు కూడా ఇద్దరూ వీసమెత్తు తేడా లేని సమానులుగానే బతకాలని అది చెబుతున్నది. పురాణాల్లో, సంప్రదాయ దురాచారాల్లో, దేవీదేవతల పరంగా వున్న అసమానతను ఇప్పటికీ కొనసాగించాలని చూస్తున్న శక్తులు పురుష దురహంకారాన్ని పోషించాలనుకుంటున్నారు. అందుకు స్త్రీనే ఉపయోగించుకొంటున్నారు. ఈ సంగతిని గ్రహించలేక ఆమె తనంత తానుగా పురుష బానిసగా కొనసాగుతున్నది. గట్టిగా చెప్పుకోవాలంటే ఇదే ఇటువంటి దుర్మార్గాలకు మూలంలో వున్న కారణం. తలిదండ్రులు అమ్మాయిని అబ్బాయి కంటే తక్కువగా పరిగణించడం అనే నేరం బాధ్యత ఇందులో మరింతగా వుంది.

మహిళలపై హింస 2020 కంటే 2021లో 15.3 శాతం పెరిగిందని జాతీయ నేర రికార్డుల విభాగం చెబుతున్నది. భారతీయ మహిళల్లో 65 శాతం మంది మగాడు పెట్టే హింసను భరించితీరాలని భావిస్తున్నట్టు తేలింది. అఫ్తాబ్ తనను పదే పదే కొడుతున్నా శ్రద్ధావాకర్ ఎందుకు అతడిని వదిలిపెట్టలేదు? సమాజం తనను చెడిపోయిన మహిళగా భావిస్తుందన్న భయం ఆమెలో గూడుకట్టుకోడం ఇందుకొక కారణం కావచ్చు. కొడితే తప్పేముంది అనే భావన ఆమె లోనూ వుండి వుండొచ్చు. దేశంలో ప్రతి 20 నిమిషాలకొక రేప్ జరుగుతున్నదని తేలింది. ఇతర కులస్థుడినో, మతస్థుడినో ప్రేమించినందుకు కుమార్తెలను నరికి చంపే తండ్రులకు కొదువ లేదు. ప్రపంచ వ్యాప్తంగా పరిపూర్ణ ప్రజాస్వామ్యబద్ధ సమాజాలు ఏర్పడనంత వరకు ఇటువంటి ఘాతుకాలు జరుగుతూనే వుంటాయి. చట్టాలు, శిక్షల వల్ల అంతరించిపోతాయనుకోడం భ్రమే అనిపిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News