మనతెలంగాణ/యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో కార్తీక పూజలు, శ్రీ స్వామివారి జన్మనక్షత్రము స్వాతి, శివుడికి మాస శివరాత్రి పూజు, క్షేత్రపాలకుడికి ఆకుపూజలతో శ్రీవారి క్షేత్రములో మహోత్సవాల శోభ నెలకొంది. మంగళవారము శ్రీలక్ష్మీనరసింహుని ఆలయంలో కార్తీక మాస పర్వదినము ఆకరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి శ్రీసత్యనారాయాణ వ్రతపూజు, దీపారాధన పూజలతోపాటు ఆలయంలో జరుగు నిత్యపూజలలో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.
వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు…
శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా సాగాయి. శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి పర్వదినం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి శతఘాటాభిషేకంతో పాటు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు, స్థానికులు స్వామి వారిని దర్శించుకొని తరించారు. తెల్లవారుజామున ఉదయం 3:30 నిమిషాలకు ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత, అభిషేక, అర్చన పూజలనంతరం శ్రీ స్వామి అమ్మవారులను ప్రత్యేక అలంకారణ గావించి స్వాతి నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి జన్మనక్షత్రం స్వాతి పర్వదినం కావడంతో భక్తులు, స్థానికులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చి తెల్లవారు జామునుండే యాదాద్రి కొండ చుట్టు గిరి ప్రదక్షిణ నిర్వహించి శ్రీలక్ష్మీనరసింహున్ని దర్శించుకున్నారు. శ్రీ స్వామి వారి అనుబంద ఆలయమైన శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలను వైభవంగా నిర్వహించారు.
శివుడికి మాస శివరాత్రి పూజ….
యాదాద్రి కొండపైన కొలువు దీరిన శ్రీ పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం మాస శివ రాత్రి పర్వదినము పురస్కరించుకొని సాయంత్రము ఆకాశ దీప పూజను వైభవంగా నిర్వహించారు. శివాలయంలో సాయంత్రము ఆలయ పండితులు అర్చకులు శాస్రోక్తంగా మంత్రోచ్చరణ గావిస్తూ ఆలయ ముందు గల ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించి వైభవంగా పూజలను నిర్వహించారు. శివాలయం నందు శంకులతో పవిత్ర దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేయడమేకాకుండా శివుడి పటాలాను వేసి పూజించారు. మాస శివరాత్రి ప్రత్యేక పూజలలో ఆలయ ఈవో గీత, వేదపండితులు, అర్చకులు, ఆలయ ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.
క్షేత్రపాలకుడుకి విశేష పూజలు..
యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామికి ప్రితికరమైన రోజు కావడంతో కొండపైన పుష్కరిణి వద్ద, ఆలయంలో ఉదయం స్వామి వారికి సింధూర క్షేపనం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రోక్తంగా ఆకుపూజను నిర్వహించారు. పాతగుట్ట పుష్కరిణి వద్ద గల ఆలయాలలో ఆకుపూజను నిర్వహించగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.
నిత్యరాబడి…
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా మంగళవారం రోజున 51,00,186 రూపాయలు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
దేవస్తానము ఆద్వర్యంలో కార్తీక వనభోజనాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం ముగింపు సందర్బంగా ఆనవాయితిగా నిర్వహిస్తున్న శ్రీసత్యనారాయణ వ్రతపూజలు, కార్తీక వనభోజన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దేవస్దానము గోశాల వనం యందు ఆలయ ఈవో, ఉద్యోగ సిబ్బందితో శ్రీసత్యనారాయణ వ్రతపూజను నిర్వహించి, కార్తీక వనభోజనం చేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు కార్తీక మాస విశిష్టతను తెలియ చేశారు.