Saturday, December 21, 2024

ఇసి ప్రక్షాళన!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) “బలహీన భుజాల మీద బరువైన అధికారాలను రాజ్యాంగం వుంచింది. ఒత్తిడులకు లొంగని దృఢ చిత్తం వుండే గట్టి వ్యక్తిని ఆ పదవికి నియమించాల్సి వుంది” అని సుప్రీంకోర్టు మంగళవారం నాడు వెలిబుచ్చిన అభిప్రాయానికి అత్యంత జాతీయ ప్రాధాన్యమున్నది. ఇంతటి సువిశాల దేశంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను మోస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఎంత అర్భకంగా వుందో దీనిని బట్టి తెలుస్తున్నది. ఒకేసారి షెడ్యూలు విడుదల కావలసి వుండిన హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు సుదీర్ఘ వ్యవధిని ఇస్తూ వేర్వేరు షెడ్యూళ్ళు ప్రకటించడంలోని ఆంతర్యం ఏమిటి, గుజరాత్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలకు, అదనంగా హామీలు గుప్పించడానికి వీలుగా అది జరగలేదా? అలాగే గతంలో ఎన్నికల సమయంలో పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తమ పరిధిలోకి రావంటూ స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ తర్వాత ప్రధాని మోడీ అంతరంగాన్ని తెలుసుకొని ఈ విషయమై రాజకీయ పార్టీలకు తాఖీదు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం చేసే ఉచితాలకు ఎక్కడి నుంచి డబ్బు సమకూర్చదలచారో చెప్పాలంటూ అందులో వాటిని ఆదేశించింది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలు ఇచ్చే ఎన్నికల విరాళాల విషయంలో నిబంధనలను తనకు అనుకూలంగా మార్చుకొన్నది. నిర్ణీత సమయాల్లో స్టేట్ బ్యాంకులో విరాళాలు జమ చేయడానికి అవకాశం కల్పించింది. దీనిని తనకు మాత్రమే ఉపయోగపడేలా వినియోగించుకొంటున్నది. మొదట్లో ఈ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ తర్వాత దీనిని పక్కన పెట్టి రూ. 20 వేల కుదించాలనే దానిపై దృష్టి సారించడం మొదలు పెట్టింది. ఇలా కేంద్రంలోని పాలకులు కోరినట్టల్లా నాట్యమాడే ఎన్నికల అజమాయిషీ వ్యవస్థ వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే చేటు ఇంత, అంత కాదు. ఎన్నికల కమిషనర్ల స్వతంత్రాధికారాలను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం నామ మాత్రంగా వ్యవహరిస్తున్నదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఎవరికీ భయపడకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగే గట్టి రాజకీయేతర వ్యక్తిని సిఇసిగా నియమించడానికి స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం భావించడం ఎంతైనా హర్షించదగినది. సిఇసి, ఇసిల ఎంపికకు, నియామకానికి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని రాజ్యాంగం 324(2) అధికరణ సూచిస్తున్నప్పటికీ ఇప్పటికి ఏడు దశాబ్దాలు గడిచినా ఆ దిశగా అడుగులు పడకపోడం పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేయడం గమనించవలసిన అంశం. ఎన్నికల కమిషన్ తమ చేతుల్లో కీలు బొమ్మగా వుండాలని కోరుకునే పాలకులే దేశాన్ని ఇంత వరకు ఏలుతున్నారు. వారు సర్వస్వతంత్ర సిఇసిని ఎందుకు కోరుకుంటారు? వాస్తవానికి రాజ్యాంగం సిఇసి/ ఇసిలకు ఆరేళ్ళ అప్రతిహత పదవీకాలాన్ని ఇచ్చింది.

అలా నియమితులైన వారిని సులభంగా తొలగించడానికి వీల్లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానమైన బలమైన మూలాలను కల్పించింది. అంటే పార్లమెంటు అభిశంసన ద్వారా తప్ప ఇతరత్రా తొలగించడానికి వీల్లేకుండా చేసింది. తనను నియమించే రాష్ట్రపతికి కూడా తొలగించే అధికారం లేని రీతిలో సిఇసి నియామకం జరగాలి. అయితే కేంద్రంలోని ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా ఎన్నికల కమిషనర్ల నియామకాలను జరుపుతున్నాయి. 2004 నుంచి ఏ ఒక్క సిఇసి ఆరేళ్ళ పదవీ కాలాన్ని అనుభవించలేదని యుపిఎ పదేళ్ళ హయాంలో ఆరుగురు సిఇసిలు, ఎన్‌డిఎ ఎనిమిదేళ్ళ కాలంలో ఎనిమిది మంది సిఇసిలు మారారని సుప్రీం ధర్మాసనం పేర్కొనడంలో ఎంత ఆవేదన ఇమిడి వుందో చెప్పనక్కర లేదు. ఈ కేసును తాను విచారణకు స్వీకరించిన మూడు రోజుల్లోనే తాజా సిఇసి అరుణ్ గోయల్‌ను నియమించడంలోని దాష్టీకాన్ని ఖండించింది. సిఇసి నియామకంలో ప్రస్తుతం వున్న పరిస్థితి అత్యంత ఆందోళనకరమని ప్రకటించిన ధర్మాసనం ఎంతో మంది సిఇసిలు వచ్చారు గాని టిఎన్ శేషన్ వంటి వారు ఎప్పుడో గాని తారసపడరని అన్నది.

అయితే శేషన్ రాజ్యాంగంలో సిఇసికి వున్న ఎదురులేని స్థితిని అర్థం చేసుకొని ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల పట్ల, నాయకుల పట్ల చండశేషన్‌గా నిరూపించుకొన్న మాట వాస్తవమే. ఆ క్రమం లో ఎన్నికల స్వచ్ఛతకు ఆయన అపూర్వ స్థాయిలో ఉపయోగపడినప్పటికీ తనను నియమించిన వ్యవస్థకు మించిపోయిన వ్యక్తిగా నిరూపించుకొన్న మాట కూడా వాస్తవమే. అలా జరగకుండానే రాజ్యాంగం తన నుంచి ఏమి కోరుకొంటున్నదో దానిని పరిపూర్ణంగా నిర్వర్తించే నిషాక్షికత గలిగిన వ్యక్తులను నియమించడానికి కొలీజియం వంటి వ్యవస్థో లేక ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన నియామక కమిటీయో ఏర్పడి తీరాలి. అప్పుడు గాని ఎన్నికల కమిషన్‌కు పట్టిన పాలకుల చుట్టూ తిరిగే పొద్దు తిరుగుడు జాడ్యం వదలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News