Monday, December 23, 2024

డిసెంబర్‌లో అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

వచ్చే నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
కేంద్ర ఆంక్షల వల్ల రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో రూ. 40వేల కోట్ల తగ్గుదల
దీనిపై ప్రజలు తెలియజేసేలా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే నెల (డిసెంబర్)లో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరితో పాటు నిధుల విషయంలోనూ చేయూతనివ్వడం లేదు. ఈ అంశాలపై తెలంగాణ ప్రజలకు తెలియజేసే విధంగా సమావేశాలను నిర్వహించాలని కెసిఆర్ తలపెట్టారు. ప్రధానంగా అభ్యుదయ పథంలో నడుస్తున్న రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022..20-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు సమకూరవలసిన ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గుదల చోటుచేసుకున్నది. ఇటువంటి చర్యలతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నది. రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ చేస్తున్న మోసాలను ప్రజలకు సవివరంగా వివరించే విధంగా సమావేశాల నిర్వహణ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును, శాసన సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డిని గురువారం సిఎం కెసిఆర్ ఆదేశించారు.

రాష్ట్రాల భవిష్యత్తుకు ఆటంకంగా కేంద్రం నిర్ణయాలు
అసంబద్ధ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్రాల భవిష్యత్తుకు, ప్రగతికి ఆటంకంగా మారుతోంది. కేంద్రం ఆడిన తొంటాడ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో బాగా తగ్గుదల కనిపిస్తోంది. వాస్తవానికి ప్రతి ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ తమ బడ్జెట్ ను రూపొందించుకుంటాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రతి రాష్ట్రానికి ఆనవాయితీగా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుంది.
2022…20-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని రూ. 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. దీనిని అనుసరించి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్‌ను రూపొందించుకున్నది.

కానీ కేంద్రం అకస్మాత్తుగా రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని రూ.39వేల కోట్లకు కుదించింది. తద్వారా రాష్ట్రానికి అందాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు తగ్గాయి. అంతే కాకుండా ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం నిధుల సేకరణకు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి ఉంటుంది. ఆర్థికంగా అత్యంత పటిష్టంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌలభ్యాన్ని కూడా పొందనీయకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తామంటెనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామనే వ్యవసాయ వ్యతిరేక రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టింది.

కేంద్రం సంకుచిత విధానాల వల్ల రూ. 40వేల కోట్ల నష్టం
ఎన్ని కష్టాలనైనా భరిస్తాం కానీ…. రాష్ట్ర రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోబోమని అని సిఎం కెసిఆర్ కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దాంతో సుమారు రూ.6 వేల కోట్లను రాష్ట్రం కోల్పోయింది. తద్వారా అవి ఎఫ్‌ఆర్‌బిఎం ద్వారా రూ. 15 వేల కోట్లు, విద్యుత్ సంస్కరణ కారణంగా మరో రూ. 6 వేల కోట్ల వెరసి కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 21 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి. ఫలితంగా రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోయింది. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ. 20 వేల కోట్ల బడ్జెటేతర నిధులను కూడా రాకుండా కేంద్రం నిలిపివేయించింది. అట్లా..కేంద్రం అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక అజ్జానంతో కూడిన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ.40వేల కోట్లకు పైగా నిధులు రాకుండా పోయాయి.

ఆర్ధిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాలకు అడ్డుగా కేంద్రం
ఇంకా దారుణం ఏంటంటే…తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులను సమీకరిస్తున్నది. ఆ నిధులను కూడా కక్షసాధింపు నిబంధనలతో రాకుండా కేంద్రం నిలిపివేయించింది. వెంటనే అప్రమత్తమైన సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఆయా సంస్థలతో ప్రభుత్వాధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపారు. రుణాల రూపంలో రాష్ట్ర ప్రగతి కోసం వారిచ్చిన నిధులను తప్పకుండా తిరిగి చెల్లించేంత ఆర్థిక పరిపుష్టి కలిగివున్నామని, ఇట్లా ఒప్పందాల ఉల్లంఘన సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం వారికి నచ్చచెప్పారు. అర్థం చేసుకున్న ఆర్థిక సంస్థలు రాష్ట్రం మీద భరోసాతో గతంలో చేసుకున్నఒప్పందాల మేరకు నిధులను ఈ మధ్యకాలంలో విడుదల చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రగతిని కాదు….దేశ ఆర్ధిక పరిస్థితిని దిగజార్చుతున్న కేంద్రం
అనేక రకాలుగా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధనం చేసి ప్రగతి పథంలో సాగుతున్న తెలంగాణ ప్రగతికి కేంద్రంలోని బిజెపి సర్కార్ అడ్డుపుల్లలు వేస్తోంది. అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అత్యద్భుత ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రతిభను పలచన చేయాలనే కుట్రపూరిత వైఖరితో కేంద్రం వ్యవహరిస్తున్నదని స్పష్టమైతోంది. ప్రతి ఏటా ఆయా రాష్ట్రాలు పొందుపరుచుకునే అంచనాలకనుగుణంగానే ప్రగతి పద్దులు రూపొందించుకుంటాయి. కానీ కేంద్రం తన ఇష్టానుసారం అనుసరిస్తున్న అసమర్థ అనుచిత నిర్ణయాల వల్ల సమయానుకూలంగా నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. తద్వారా కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు దేశాభివృద్ధికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచివున్నది. ఇటువంటి పూర్తి ఆర్థిక అజ్జానంతో కూడిన, అనాలోచితమైన, అసంబద్ధ నిర్ణయాల వల్ల ఒక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు.. దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తున్నది.

సమాఖ్యస్పూర్తికి కేంద్రం తూట్లు
కేంద్రం తన కక్షపూరిత దిగజారుడు విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల గొంతును కోస్తూ, నష్టపరుస్తూ, దేశ సమాఖ్యస్పూర్తికి తూట్లు పొడుస్తున్నది. కేంద్ర అనుసరిస్తున్న ఇటువంటి అసంబద్ధ విషయాలను ఇటు రాష్ట్ర ప్రజల దృష్టికి అటు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం బావిస్తున్నది. అందులో భాగంగా డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీ వేదికద్వారా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించి చర్చించాలని నిర్ణయించింది.

Telangana Assembly winter session in Dec

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News