భారత ఉపఖండాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటున్న తరుణంలో ప్రజల న్యాయపరమైన సవాళ్లను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థను “లార్డ్ బ్రెయిన్” అనే రాజనీతి విశ్లేషకుడు న్యాయశాఖ సామర్థ్యం కంటే ప్రజాస్వామ్యానికి మరో గీటు రాయి లేదని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారు మొదటగా ఆక్రమించిన బెంగాల్ ప్రావిన్స్‌లో రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్‌లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయగా దీని పరిధిలో బీహార్, ఒడిశా, బెంగాల్ ప్రావిన్సులు ఉండేవి.
కింగ్ జార్జ్ 3వ కాలం 1800 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో రెండవ సుప్రీంకోర్టు, 1823 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీలో 3వ, సుప్రీంకోర్టులను ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయాన్ని అందించారు. బ్రిటిష్ పరిధిలోకి ప్రావిన్సులు పెరిగిన తర్వాత ఇండియన్ హైకోర్టు చట్టం -1861ని తీసుకు వచ్చి పైన పేర్కొన్న మూడు సుప్రీంకోర్టులను రద్దు చేసి అన్ని ప్రావిన్స్‌లలో హైకోర్టులను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి హైకోర్టుని జులై 2, 1862న కలకత్తాలో ఏర్పాటు చేయగా బ్రిటిష్ పరిపాలనలో హైకోర్టు తీర్పులే అంతిమమైనవిగా ఉండేవి. ఈ తీర్పులపై ఆవశ్యకమైన, రాజ్యాంగపరమైన అంశాలకే లండన్‌లో ఉన్న ప్రివ్యూ కౌన్సిల్‌కి అప్పీ ల్‌కి వెళ్ళేది. “భారత ప్రభుత్వ చట్టం 1935” ప్రకారం “ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాని ముగ్గురు జడ్జీలతో ఢిల్లీలో ఏర్పాటు చేయగా ఇందు లో ప్రధాని న్యాయమూర్తిగా బ్రిటిష్ (క్రిస్టియన్) మిగతా ఇద్దరిలో ఒకరు ముస్లిం, మరొకరు హిందూగా ఉన్న న్యాయమూర్తులు లౌకిక భావంతో నియమించడం జరిగింది.
ఈ ఫెడరల్ కోర్టు అక్టోబర్ 1, 1937 నుండి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి (తేదీ 26 జనవరి 1950) వరకు దాదాపుగా 12 సంవత్సరాల 4 నెలలు పని చేయగా 135 రాజ్యాంగపరమైన తీర్పులను ఇచ్చింది. ఇది సంవత్సరాల కాలంలో కేవలం 30 రోజులు మాత్రమే పని చేస్తూ రాజ్యాంగపరమైన అంశాల తీర్పులను వెలువరిస్తూ అత్యున్నత న్యాయస్థానంగా నడిచేది. భారత దేశానికి స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం 1950 అమలులోకి వచ్చాక ఆర్టికల్ -131 ఒరిజినల్ జ్యురిష్‌డిక్షన్ (ప్రాథమిక విచారణ అధికార పరిధి), ఆర్టికల్ -143 అడ్వైజర్ జ్యురిష్‌డిక్షన్ (సలహా పూర్వక విచారణ పరిధి) ఆర్టికల్స్‌ని భారత ప్రభుత్వం చట్టం 1935 నుండి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాకు ఉన్నట్లు సుప్రీంకోర్టుకు ఆపాదించి అదనంగా ఆర్టికల్ 132, 133, 134 అప్పీలేట్ జ్యురిష్‌డిక్షన్ (సివిల్, క్రిమినల్ అప్పీల్స్ విచారణ అధికార పరిధి), ఆర్టికల్- 136 స్పెషల్ లీవ్ పిటిషన్స్ (సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో ఆప్పీల్స్ స్వీకరించే విచక్షణాధికారం) అధికరణలని అదనంగా రాజ్యాంగంలో చేర్చారు.
సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యురిష్‌డిక్షన్ ద్వారా కేంద్రం, రాష్ట్రాలు, అంతరాష్ట్ర వివాదాలు, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు పరిష్కరించాలి. కానీ ఆప్పీలేట్ జ్యురిష్‌డిక్షన్ కలిగి ఉండటం ద్వారా హైకోర్టులు ఇచ్చినటువంటి సివిల్ భార్యాభర్తల గొడవలు అయిన ఫ్యామిలీ, వివిధ రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలకు తగ్గట్టుగా ఉన్నటువంటి భూ చట్టాలు, భూ వివాదాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, కార్పొరేట్ విషయాలు, విద్యా సంబంధమైన వివాదాల తీర్పులు, క్రిమినల్ తగాదాలైనా మర్డర్, దొంగతనాలు, మానభంగాలు, ఫోర్జరీ, చీటింగ్‌లు, బెదిరింపులో కేసుల తీర్పులను అప్పీల్ కేసులుగా స్వీకరించటంతో జిఎస్‌టి, ఆర్టికల్- 370, ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఆయా రాష్ట్రాల మధ్య గల నీటి పంపకాలు లాంటి అత్యంత కీలకమైన రాజ్యాంగపరమైన కేసులు విషయంలో జాప్యం జరిగి ఈ కేసులు కొలిక్కిరావటం లేదు. ఆయా రాష్ట్రాలు ఇచ్చిన హైకోర్టు తీర్పులను స్వీకరించడంవలన, దీపావళికి టపాకాయలు కాల్చాలా వద్దా లాంటి అనవసర విషయాలను అప్పీల్‌గా స్వీకరించటంతో అసలైన కేసులు, రాజ్యాంగపరమైన కేసులు పెండింగ్‌లోపడి విచారణకు నోచుకోవ టం లేదు. ఆర్టికల్- 136 స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా అదనంగా కేసులు స్వీకరించడంతో సుప్రీంకోర్టులో కేసులన్నీ కోకొల్లలుగా పెండింగ్‌లో పడుతూ అసలైన రాజ్యాంగపరమైన కేసులు కాకుండా, 90% క్రిమినల్, సివిల్ అప్పీల్స్, ఎస్‌ఎల్‌పికేసుల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా మారడంతో ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తులకు కేటాయించే కేసులు విషయంలో రోస్టర్ సమస్యలు తలెత్తుతున్నాయి.
ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు సలహా పూర్వక విచారణ పరిధి ద్వారా గవర్నర్ జనరల్ 4 సార్లు మాత్రమే సలహా సూచనలు అడిగితే, సుప్రీంకోర్టు ఏర్పడ్డాక రాష్ట్రపతి ఢిల్లీ న్యాయ చట్టాల అంశం 1951, కేరళ విద్యా బిల్లు 1958, రాష్ట్రపతి ఎన్నికలు -1974, రామ జన్మభూమి వివాదం- 1993, సహజ వనరుల వేల వివాదాలు 2012 ఇలాంటి వివాదపరమైన అంశాలను 15 సార్లకు పైగా సలహా సూచనలు కోరారు. సుప్రీంకోర్టు కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆర్టికల్ -131 ప్రకారం ఏ సమస్యనైనా పరిష్కరించాలి. కానీ “స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా” కేసులో పార్లమెంటు చేసిన చట్టం ప్రజలకు అన్యాయం కలిగిస్తుందని ఈ చట్టానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళితే ఆర్టికల్- 256 కింద పార్లమెంటు చేసిన చట్టాల పరిధిలోకి రాష్ట్రాలు ఆర్టికల్- 131 ప్రకారం ఒరిజినల్ జ్యురిష్‌డిక్షన్ కిందకు రావని పార్లమెంటు చేసిన చట్టమే అంతిమమైనదిగా కేసును కొట్టి వేసి సుప్రీంకోర్టు తన రాజ్యాంగ పరిధిని తానే తిరస్కరించుకుంది. ప్రజలు పిటిషన్‌లే కాకుండా రాష్ట్రం, పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్- 131 కింద ఎన్‌ఆర్‌సి , సిఎఎని ఛాలెంజ్ చేసిన ఏకైక రాష్ట్రం కేరళ. పైగా ఇవన్నీ చాలా ఉన్నట్టు ఆర్టికల్- 138 ప్రకారం పార్లమెంటు సుప్రీంకోర్టుకు అదనపు అధికారాలను సంక్రమింప చేయవచ్చని పేర్కొంది.
దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రయల్ కోర్టులలో 2012 లెక్కల ప్రకారం పెండింగ్ కేసుల వివరాలు చూస్తే ట్రయల్ కోర్టులలో సుమారు 2 కోట్ల 70 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, పని చేసే జడ్జీల సంఖ్య 21 వేల పైగా ఉంది. అనగా సగటున ఒక్కొక్క జడ్జీకి 1200 నుంచి 1300 మధ్య కేసుల భారాన్ని కలిగి ఉన్నాడు. దేశ వ్యాప్తంగా 25 హైకోర్టులు ఉండగా 700 మంది జడ్జీలు పని చేస్తూ 42 లక్షలపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రారంభంలో (1+7) ఎనిమిది మంది న్యాయమూర్తులతో మొదలై 2019 సవరణ ప్రకారం (1+ 33) ఒక ప్రధాన న్యాయమూర్తిని 33 మంది న్యాయమూర్తులను కేటాయించగా ప్రస్తుతం 20 పైగా న్యాయమూర్తులు పని చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దాదాపు 60 వేల పైగా పెండింగ్ కేసులు ఉండగా, ఒక్కొక్క న్యాయమూర్తికి 2000 కేసులను పరిష్కారం చూపే బాధ్యతను కలిగి ఉండటంతో సగటున సుప్రీంకోర్టు జడ్జీలకి జిల్లా కోర్టు జడ్జీల కంటే పెండింగ్ కేసులు ఎక్కువ. అదే విధంగా హైకోర్టులలో పెండింగ్ కేసులు అన్నింటిలో దాదాపుగా 8 లక్షలపై కేసులు పది సంవత్సరాల పైబడి పెండింగ్‌లో ఉండి విచారణకు నోచుకోవటం లేదు. 1946 సంవత్సరంలో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా పని తీరు చూస్తే సంవత్సర కాలంలో 26 రోజులు పని చేసి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి 14 కేసులను విని 11 కేసులలో తీర్పులు ఇచ్చింది. అంటే దాదాపుగా 90 శాతం కేసులు తీర్పులు ఇవ్వబడ్డాయి.
ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రారంభంలో 176 రోజుల పని దినాలతో మొదలై 193 రోజులుగా, 222 రోజుల పని దినాలుగా సంవత్సరానికి పని చేస్తూ రాజ్యాంగపరమైన అంశాలు, హైకోర్టు ఆప్పీల్స్, సివిల్, క్రిమినల్, స్పెషల్ లీవ్ పిటిషన్ కేసులను స్వీకరించటంతో 75 సంవత్సరాలుగా 60 – 70 వేల కేసులు పెండింగ్‌లో ఉండగా, సగటున సంవత్సరానికి 1000 కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజులు కేసులు రెట్టింపుపై న్యాయమూర్తుల పని భారం పెరిగి ప్రజలకు సత్వర న్యాయం అనేది దూరపు కొండలు నునుపు లాగా న్యాయం అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ జటిలమైన సమస్యకు ప్రధాన కారణం ఏకీకృత న్యాయ వ్యవస్థను ఒకే దేశం- ఒకే భాష, ఒకే దేశం- ఒకే సంస్కృతి, ఒకే దేశం -ఒకే తీర్పు అన్నతరహాలో న్యాయ వ్యవస్థను పటిష్టం చేయటం వల్లనే ఈ పరిస్థితి జరుగుతుందని ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి.ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సివిల్, క్రిమినల్ కేసులలో హైకోర్టు తీర్పు లే అంతిమమైనవిగా ఉండాలి, అందుకుగాను రాజ్యాంగ సవరణ చేయాలి. దీనితో సుప్రీంకోర్టుకు వెళ్లే అప్పీల్ కేసులన్నీ హైకోర్టు స్థాయిలో పరిష్కారం అవుతాయి. దీనికి కారణం లేకపోలేదు భారత దేశంలో ఒక్కొక్క రాష్ట్రం ప్రత్యేక భాషలను, సంస్కృతులను, ప్రత్యేక భూమి చట్టాలను కలిగి ఉన్నాయి. న్యాయస్థానం రాజ్యాంగపరమైన అంశాలను కాకుండా అతిచిన్న విషయాలైనా ఆస్తి పంపకాలు, భూ తగాదాలు, భార్యాభర్తల వివాహాలకు సంబంధించిన తగాదాలు, దీపావళి పండుగకు బాంబులు కాల్వాలనా వద్దా, ఒక వ్యక్తి ఆస్తి పన్ను నిజంగానే ఎగ్గొట్టాడా? లేదా? విద్యా సంస్థలు ఎలా పని చేస్తున్నాయి అనే అంశాలను సుప్రీంకోర్టు స్వీకరించటంతో సామాన్య ప్రజల సమ యం, డబ్బు వృథానే అవుతుంది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం కూడా.
ఉదాహరణకు టాడా చట్టం- 1985లో చేస్తే 1991 సంవత్సరం నాటికి దీనిపై ఆరు సంవత్సరాల కాలంలో వెయ్యికి పైగా కేసులు పడటంతో 1994 లో సుప్రీంకోర్టు ఈ చట్టం రాజ్యాంగబద్ధమే అనగా 1995లో పార్లమెంటు ఈ చట్టాన్ని తొలగించింది. కాలయాపనకు ఈ సంఘటన చాలు. ఆయా రాష్ట్రాలలో భూ చట్టాలు తమకు తగ్గట్టుగా చట్టాలను చేసుకుని పాలన కొనసాగిస్తున్నారు. ఈ భూ సంబంధిత తగాదాలు ఆ రాష్ట్ర పరిధి వరకే అంతిమంగా ఉండాలి అంతకు మించి సుప్రీంకోర్టు స్థాయి అప్పీలుకు వెళ్ళేది ఉంటే సమయం, డబ్బు వృథా అవుతుంది. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన భార్యాభర్తల కేసు విషయంలో 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి మధ్య గల డైవర్స్ కేసు మొదలై వారికి 50 సంవత్సరాలు వచ్చేసరికి సుప్రీంకోర్టులో అంతిమ తీర్పు వెలువరించే క్రమంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ వారి మధ్య సయోధ్య కుదర్చడం జరిగింది అంటే ఈ కేసు విషయంలో దాదాపుగా వీరికి 25 సంవత్సరాల సమయం, డబ్బు వృథా, మానసిక వేదన మిగిలింది తప్ప తిరిగి చూసుకుంటే ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కనుక భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే సమైక్య న్యాయ వ్యవస్థ ద్వారానే సాధ్యం. ప్రస్తుత సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటి పరిష్కారానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి తిరిగి “ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా”ను అత్యున్నతమైన కోర్టుగా పునఃస్థాపించి కేవలం రాజ్యాంగపరమైన ఒరిజినల్ జ్యురిష్‌డిక్షన్ అంశాలకు మాత్రమే పరిమితం చేస్తే ప్రతి పౌరునికీ న్యాయం చేకూరి రాజ్యాంగం రక్షించబడుతుంది. లేదంటే సామాన్య ప్రజానీకానికి న్యాయం అనేది కలగానే మిగిలిపోతుంది.