Monday, December 23, 2024

భారీగా పెరిగిన ఒయు లా కోర్సుల ఫీజులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ విద్య కోర్సుల ఈసారి భారీగా పెరిగాయి. ఒయు న్యాయ కళాశాలలో రెగ్యులర్ మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బికి గత ఏడాది రూ.5,460 ఫీజు ఉండగా, ఈసారి రూ.16,000లకు పెరిగింది. అలాగే రూ.4,500 ఉన్న ఎల్‌ఎల్‌ఎం ఫీజు రూ.20,100కు పెరిగింది. గత ఏడాది ఫీజులతో పోల్చితే దాదాపు నాలుగు రెట్లు ఫీజు పెరిగింది. ఎంఎల్‌ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు మూడింతలు పెరిగాయి. గత ఏడాది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.15,000 ఉండగా, ఈసారి ఆ ఫీజును రూ.33,000లకు పెంచారు. ఒయు రెగ్యులర్ లా కోర్సులకు ప్రైవేట్ కాలేజీలతో సమానంగా ఫీజులు నిర్ణయించారు. రెగ్యులర్ లా కోర్సుల ఫీజుల పెంపుపై ఎలాంటి ప్రకటన లేకుండానే విపరీతంగా ఫీజులు పెంచడం పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఒయు న్యాయ కళాశాలలో లా కోర్సుల్లో సీట్లు పొందుతారు. పెంచిన ఫీజులు సాధారణ ర్యాంకులు సాధించిన ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందిన వారు, ఒయులో కళాశాలల్లో సీట్లు పొందిన సమానంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సుల ఫీజు పెరగడాన్ని ఒయు జెఎసి అధ్యక్షుడు కురవ విజయ్‌కుమార్ ఖండించారు. ఫీజుల పెంపు వల్ల ప్రతిభ గల ఎస్‌సి,ఎస్‌టి,బిసి విద్యార్థులు న్యాయ విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన లా కోర్సుల ఫీజుల తగ్గిస్తూ ఒయు పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లాసెట్ తొలి విడతలో 5,747 సీట్ల కేటాయింపు

రాష్ట్రంలో న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సులతోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ విద్యాసంవత్సరం మొత్తం 6,724 సీట్లు అందుబాటులో ఉండగా, 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నన్నారు. అందులో మొదటి విడతలో 5,747 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బిలో 4,064 సీట్లు అందుబాటులో ఉండగా, 3,598 సీట్లు కేటాయించగా, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బిలో 1,784 సీట్లకు 1,440 సీట్లు కేటాయించారు. అలాగే 876 ఎల్‌ఎల్‌ఎం సీట్లకు 709 మంది అభ్యర్థులు సీట్లు పొందినట్లు ప్రవేశాల కన్వీనర్ పి.రమేష్‌బాబు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 3 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి సీట్లు తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News