మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మూడు సాగు నీటి ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మంగళవారం మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సెక్రటరి పంకజ్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీ శ్రమశక్తి భవన్‌లో టక్నికల్ అడ్వైజరీ కమిటి(టిఎసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సబంధించిన భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వరం (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, అదిలాబాద్ జిల్లాలోని చనాకాకోరాట బ్యారేజి, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం అమోదం తెలిపింది. గత ఏడాది జులైలో కేంద్ర ప్రభుత్వం జారీ జేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో కేంద్ర జల్‌శక్తిశాఖ ఈ మూడు ప్రాజెక్టులను ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డిపిఆర్‌లను గత ఏడాది సెప్టెంబర్‌లోనే కేంద్ర జలసంఘానికి, గోదావరి నదీ యాజమాన్యబోర్డుకు సమర్పించింది.కేంద్ర జలసంఘంలో వున్న వివిధ డైరెక్టరేట్లు ఈ మూడు ప్రాజెక్టుల డిపిఆర్‌లను కూలంకషంగా పరిశీలించి ఆమోదాన్ని తెలిపాయి.
ఆ తర్వాత డిపిఆర్‌ల పరిశీలనకు సబంధించి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలనకోసం పంపడం జరిగింది.2022 ఏప్రిల్ లో జరిగిన 13వ బోర్డు సమావేశంలో ఇవి చర్చకు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను వ్యతిరేకించినా కూడా, బోర్డు తన రిమార్కులతో మళ్లీ కేంద్ర జలసంఘానికి పంపింది. ఏపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తిరిగి పరిశీలించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులకు టెక్నో ఎకనమిక్ క్లియరెన్స్ ఇవ్వవచ్చని సిఫార్సు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. దీంతో మంగళవారం జరిగిన టిఏసి సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాల పట్ల సంతృప్తి చెంది చనాకాకోరాట, ముక్తేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాలకు ఆమోదం తెలుపుతున్నట్టు చైర్మన్ పంకజ్ కుమార్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన మినిట్స్ కూడా జారీ చేస్తామని తెలిపారు. టిఏసి సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జి, కేంద్ర జలసంఘం చైర్మన్ ఆర్.కె.గుప్తా, సభ్యులు చంద్రశేఖర్ అయ్యర్, రుష్విందర్ వోరా, కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్లు పైథాంకర్, బిపి పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్ధిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వశాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్టీ శ్రీధర్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కమిటీ చైర్మన్ పంకజ్ కుమార్‌కు ఇతర సభ్యులకు ఈ ఈ సందర్బంగా రజత్ కుమార్ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Centre green signal to 3 Irrigation Projects of Telangana