Tuesday, December 24, 2024

చార్జీల పెంపు లేదు

- Advertisement -
- Advertisement -

విద్యుత్తు చార్జీల పెంపు లేదు
కొత్త ఏడాదిలోనూ పాత చార్జీలే
యధావిధిగా ఉచిత విద్యుత్తు పథకం అమలు
రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.10,535 కోట్లు
వార్షిక వ్యయం రూ.54,060 కోట్లు
చార్జీల రూపంలో వచ్చే ఆదాయం రూ.43,525 కోట్లు
ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్లు ఉచితం
లాండ్రీలు, సెలూన్‌లకు 250 యూనిట్లు ఉచితం
చేనేతలు, ఫౌల్ట్రీలకు రూ.2లకే యూనిట్ విద్యుత్తు
మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్తు వినియోగదారులకు శుభవార్త. 2023-24వ ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్తు చార్జీలను పెంచకుండానే ప్రస్తుతం అమలవుతున్న టారిఫ్‌నే వచ్చే ఏడాదిలోనూ అమలు చేయడానికి విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విద్యుత్తు సంస్థలైన రెండు డిస్కంలు విద్యుత్తు నియంత్రణ మండలి (ఈ.ఆర్.సి)కి సమర్పించిన 2023-24వ ఏడాది వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏ.ఆర్.ఆర్)లో డిస్కంలు పేర్కొన్నాయి. అదే విధంగా జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా సరఫరా చేసే విద్యుత్తును యధావిధిగా అమలుచేయనున్నారు. ఉచిత విద్యుత్తు పథకంతో ప్రస్తుతం లబ్దిపొందుతున్న 27.62 లక్షల మంది రైతాంగానికి మేలు చేసే విధంగా వచ్చే ఏడాది కూడా ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండానే అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత విద్యుత్తు పథకంతో పాటుగా మరో మూడు రంగాలకు అందిస్తున్న సబ్సిడీల భారం ఏకంగా 10 వేల 535 కోట్ల రూపాయల నిధుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తోందని డిస్కంలు ఈ.ఆర్.సి.కి నివేదించాయి.

2023-24వ ఆర్ధిక సంవత్సరంలో డిస్కంలకు మొత్తం 54,060 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతుండగా ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్తు చార్జీల రూపంలో డిస్కంలకు 43,525 కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయని, లోటు 10,535 కోట్ల రూపాయలు ఉందని డిస్కంలు ఈ.ఆర్.సి.కి తెలిపాయి. అంతేగాక వచ్చే ఆర్ధిక సంవత్సరానికి మొత్తం 83,113 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుందని, అయితే ప్రస్తుతం 73,618 మిలియన్ యూనిట్లు అమ్మకానికి అందుబాటులో ఉందని డిస్కంలు తెలిపాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 101 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్తును సరఫరా చేసే పథకం యధావిధిగా కొనసాగిస్తారు. నాయీ బ్రాహ్మణులు, లాండ్రీలకు నెలకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును సరఫరా చేసే పథకాన్ని కొనసాగిస్తారు. పవర్ లూమ్స్, ఫౌల్ట్రీ ఫాం, స్పిన్నింగ్ మిల్లులకు సబ్సిడీతో ఒక యూనిట్ విద్యుత్తును కేవలం రెండు రూపాయలకే సరఫరా చేసే పథకాన్ని యధావిధిగా వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనూ కొనసాగించే విధంగా డిస్కంలు ఈ.ఆర్.సి.కి నివేదించాయి.

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తుది నిర్ణయం:ఈ.ఆర్.సి. చైర్మన్ శ్రీరంగారావు
విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని టిఎస్‌ఈఆర్‌సి ఛైర్మన్ తన్నీరు శ్రీరంగా రావు బుధవారం మీడియాకు వివరించారు. దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 202324 ఆర్థి క సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఎఆర్‌ఆర్), టారీఫ్ ప్రతిపాదనలను సమర్పించాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న విద్యుత్ ఛార్జీలను 202324లో సైతం యధాతథంగా కొనసాగించాలని, రెండు డిస్కంలు ప్రతిపాదించినట్లు శ్రీరంగారావు తెలిపారు. ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈఆర్‌సి వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కోసం త్వరలో బహిరంగ విచారణ తేదీలను ప్రకటిస్తామన్నారు. అన్ని వర్గాల వాదనలు విన్న తరువాత 202324 సంవత్సరానికి సంబంధించిన రిటైల్ టారీప్ ఆర్డర్‌ను జారీ చేస్తామని వచ్చే ఏడాది 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.

కాగా ప్రస్తుత విద్యుత్ ఛార్జీలను వచ్చే ఏడాది సైతం కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించినప్పటికీ డిస్కంల ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తరువాత అవసరమైతే ఛార్జీలు పెంచాలా? తగ్గించాలా? అనే అంశంపై ఈఆర్‌సి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ పాఠశాలల కేటగిరీ కింద విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని విజ్ఞప్తులు తమ పరిశీలనలో ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న బొగ్గు ధరలతో పెరుగుతున్న విద్యుత్ కొనుగోళ్ల వ్యయాన్ని ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు డిస్కంలు అనుమతి కోరగా అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించినట్లు శ్రీరంగారావు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా 30 పైసలు పెంచి ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతిస్తూ డిస్కంలకు తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గతేడాది టారీఫ్ ఉత్తర్వుల్లో డిస్కంలకు కొన్ని ఆదేశాలు ఇచ్చామని శ్రీరంగారావు వెల్లడించారు. ప్రధానంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించడంపై ఇచ్చిన ఆదేశాల అమలుకు డిస్కంలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కాగా విద్యుత్ పంపిణీ మరియు సరఫరాలో నష్టాలు కొన్ని డివిజన్లలో 50 శాతానికి మించి ఉన్నాయని, ఈ నష్టాలను 15 శాతానికి తగ్గిస్తేనే టారీప్ ప్రతిపాదనలను ఆమోదిస్తామని డిస్కంలకు తెలిపినట్లుగా ఈఆర్‌సి ఛైర్మన్ శ్రీరంగా రావు మీడియాకు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News