టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు.
హైకోర్టులో వాడీవేడిగా కొనసాగిన వాదనలు
విచారణ డిసెంబర్ 6కు వాయిదా
ఢిల్లీ పెద్దలతో నిందితుల ఫోటోలు, వాట్సాప్ ఛాట్
హైకోర్టుకు సిట్ బృందం కీలక ఆధారాలు సమర్పణ
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసుకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టులో వాడీవాడీగా వాదనలు జరిగాయి. ఉదయం 11 గంటలకు న్యాయస్థానం కేసు విచారణను ప్రారంభించింది. మధ్యాహ్నం కొద్దిసేపు లంచ్ బ్రేక్ ఇచ్చింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు విచారణ తిరిగి ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్వంత్ ధవే, బిజెపి తరపున మహేష్ జెఠ్మలానీ, ఇదే కేసుకు సంబంధం ఉన్న మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై కూడా పలువురు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. తప్పు చేయకపోతే సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది దవే వాదించారు. అరెస్టైన నిందితులకు బిజెపి అగ్రనేతలతో సంబంధాలున్నాయిన దవే వాదించారు. ఎంఎల్‌ఎల కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నా యన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సిఎందేనని ధవే ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహరాన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిఎం కెసిఆర్ బయట పెట్టారని దవే గుర్తు చేశారు. ఇది తప్పేలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. సిట్ విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని దుశ్వంత్ దవే ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే సిట్ విచారణను కెసిఆర్ ఉపయోగించుకుంటున్నారని బిజెపి తరపున న్యాయవాది జెఠ్మలానీతోపాటు నిందితుల తరపున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సిట్ దర్యాప్తు నిర్వహిస్తున్న విషయాన్ని దవే కోర్టు ముందుంచారు. సిబిఐ లేదా స్వతంత్య్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని బిజెపి సహా నిందితుల తరపున న్యాయవాదులు కోరుతున్నారు. సిఎం కనుసన్నల్లోనే సిట్ విచారణ జరుగుతుందన్నారు. ఈ మేరకు గతంలో పలు రాష్ట్రాల్లో జరిగిన కేసుల ఉదంతాలను కూడా న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా నాలుగు గంటలకు పైగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, నిందితుల తరపున వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.
అనూహ్య పరిణామం.. పిఎం ఆఫీస్‌కు లింక్
ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సిట్ బృందం కీలక ఆధారాలు సమర్పించింది. ఢిల్లీ పెద్దలతో నిందితులు సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, నందకూమార్ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్స్‌ను కోర్టుకు సమర్పిం చింది. ముగ్గురు నిందితుల కాల్ డేటా వివరాలను అందజేశారు. అంతేకాకుండా అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలు, వారు ప్రయాణించిన విమాన టికెట్ల వివరాలు, వారి మధ్య జరిగిన సంభాషణల వివరాలను కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు.
ఇప్పటివరకు జాబితాలో లేని కొత్త పేర్లను అధికారులు ప్రస్తావించారు. 41 సిఆర్‌పిసి నోటీసులు అందుకున్న వారి జాబితాను పేర్కొన్నారు. ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయాల్సి ఉందని తెలిపారు. అనుమానితులకు 41ఎ సిఆర్‌పిసి కింద నోటీసులు ఇచ్చామని చెప్పారు. అనుమానితులకు నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆడియో టేప్‌లో వెలుగులోకి వచ్చిన వ్యక్తులపై దర్యాప్తు చేయాల్సి ఉందని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో వెల్లడించారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని బిజెపి ఆరోపిస్తున్న తరుణంలో సిట్ సేకరించిన కీలకమైన సమాచారాన్ని కోర్టు ముందు ఉంచడం సంచలనంగా మారుతోంది. ఈ సందర్భంగా సిట్ తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే సిట్ వద్ద కీలకమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని, సిట్ బృందానికి సారథ్యం వహిస్తున్న సివి ఆనంద్ మరో ఐదేళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారని అందువల్ల ఆయన రాబోయే కాలంలో దేశంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసులో ఎక్కడా పక్షపాతం చూపడం లేదని దవే కోర్టులో వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా కోర్టుకు సిట్ సమర్పించిన ఆధారాల్లో సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతికి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌కు మధ్య ఆగస్టు 2021నుంచి జరిగిన వాట్సాప్ చాటింగ్, స్క్రీన్ షాట్‌లను సిట్ బృందం కోర్టుకు సమర్పించింది. ఏప్రిల్ 11న బిఎల్ సంతోష్, రామచంద్రభారతిలు హరిద్వార్‌లో సమావేశమయ్యారని పేర్కొంది. ఇదే విషయాన్ని ఎం.విజయ్ కన్‌ఫర్మ్ చేశాడని తెలిపింది. ఏప్రిల్ 26,2022 తెలంగాణ ఆపరేషన్‌పై రామచంద్రభారతి బిఎల్ సంతోష్‌కు వాట్సాప్ మెసేజ్ చేశాడని పేర్కొంది. సింహయాజులు స్వామీజీ స్కై హై హోటల్‌లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ పార్టీ కీలక నేత దామోదర రాజనర్సింహాలతో సమావేశమయ్యారు. అదే సమయంలో ప్రస్తుతం వారు ఉన్న పార్టీ నుంచి బిజెపిలో చేరే విధంగా చర్చించారు. ఇదే విషయాన్ని ఎం.విజయ్, అడ్వకేట్ పి.ప్రతాప్‌లు కన్‌ఫర్మ్ చేశాడని పేర్కొంది. ఆగస్టు 21, 2022న రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, అడ్వకేట్ పి.ప్రతాప్, కె.సి.పాండే(వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు)లు అత్యవసర సమావేశమైనట్లు పేర్కొంది. అది కూడా ఢిల్లీలోని కెసి పాండే హౌస్‌లో వారు సమావేశమైనట్లు అడ్వకేట్ ప్రతాప్ కన్‌ఫర్మ్ చేశాడని పేర్కొంది. సెప్టెంబర్ 4, 2022న రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్, అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్‌లు వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్, ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, అందరి ఫోన్ లోకేషన్‌లను సైతం సమర్పించారు. నందకుమార్, సింహయాజులు స్వామీజీ, అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్ నాగపూర్, ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి వార్షిక భారతీయ రక్షా మోర్చ్ సమావేశానికి అటెండ్ అయ్యారని, అక్కడ నేతలను కలిశారని పేర్కొంది. సెప్టెంబర్ 26న నందకుమార్ ఇంట్లో రామచంద్ర భారతి, నందకుమార్, సింహాయాజులు స్వామీజీ, బూసారపు శ్రీనివాస్, అడ్వకేట్ పి.ప్రతాప్, ఎం.విజయ్‌కుమార్‌లు ఎంఎల్‌ఎల కొనుగోలు, ఇతర ఎంఎల్‌ఎలను పార్టీలోకి తీసుకురావడం తదితర విషయాలపై చర్చించినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14 వరకు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు స్వామీజీ, డాక్టర్ జగ్గుస్వామి, అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్, అడ్వకేట్ పి.ప్రతాప్‌లు కొనుగోలు ఎంఎల్‌ఎలతో వాట్సాప్ కన్జర్వేషన్, రెగ్యులర్ కాల్స్/మేసేజ్‌ల లిస్ట్‌ను సమర్పించింది. అక్టోబర్ 15, 2022న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ (ప్రభుత్వ క్వార్టర్స్‌లో) ఉదయం 10 గంటలకు బిఎల్ సంతోష్, తుషార్ వెల్లంపల్లి, రామచంద్రభారతి, నందకుమార్, ఎం.విజయ్‌కుమార్ కీలక సమావేశం నిర్వహించారని, అందుకు సంబంధించిన వీడియోలు, ట్రావెల్ డాక్యుమెంట్లు తదితరాలను సమర్పించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ ప్రతాప్ కన్‌ఫర్మ్ చేశాడని పేర్కొంది.
రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు స్వామీజీ, డాక్టర్ జగ్గుస్వామి, అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్, అడ్వకేట్ ప్రతాప్, ఎం.విజయ్‌కుమార్ లకు సంబంధించి సెప్టెంబర్ 15,2022 నుంచి అక్టోబర్ 26, 2022 వరకు వాట్సాప్ చాట్ వివరాలను పొందుపర్చింది. అక్టోబర్ 26,2022న మొయినాబాద్ ఫాంహౌస్‌లో నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు స్వామీజీ బేరసారాలు కొనసాగించారని, ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్‌లు, వాట్సాప్ గ్రూప్ కాల్స్‌తో పాటు రామచంద్ర భారతి ఇందుకు సంబంధించి బిఎల్ సంతోష్‌కు వాట్సాప్ మేసేజ్‌ని సైతం సమర్పించారు. ఇందుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ వాయిస్ రికార్డులను సైతం సమర్పించింది. కేసుతో ప్రమేయమున్న ఏడుగురు నిందితుల రెగ్యులర్ వాట్సాప్ కాల్స్‌ను సైతం సిట్ సేకరించి సమర్పించింది. ముగ్గురు నిందితులతో నలుగురు ఎంఎల్‌ఎలు జరిపిన వాయిస్ రికార్డింగ్, ఆడియో క్లిప్‌లను సైతం సిట్ సమర్పించింది.
అలాగే ఈ సందర్భంగా బిజెపి పెద్దలతో నిందితులు దిగిన ఫోటోలను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. అందులో గతంలో బిఎల్ సంతోష్‌తో రామచంద్రభారతి కలిసిన ఫోటోలతో పాటు వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కన్జర్వేషన్‌కు సంబంధించిన కాల్‌డేటాను సిట్ సేకరించి కోర్టుకు సమర్పించింది.
సిట్ దర్యాప్తుకు తుషార్ సహకరించాలన్న హైకోర్టు
కేరళ బిడిజెఎస్‌అధ్యక్షుడు తుషార్ వెల్లంపల్లి ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. సిట్ దర్యాప్తునకు తుషార్ సహకరించాలని న్యాయస్థానం పేర్కొంది. కానీ తుషార్‌ను మాత్రం అరెస్ట్ చేసేందుకు వీల్లేదని తెలిపింది. 41ఎ నోటీసు ఇచ్చి నిందితుల జాబితాలో తుషార్‌ను చేర్చారని ఆయన తరపు న్యాయవాది అన్నారు. లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారని ఆయన వాదించారు.
TS HC Extends MLAs Poaching Case to Dec 6