న్యూఢిల్లీ : ఓ జడ్జీకి సంబంధించిన అభ్యంతరకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వ అధికారులకు అందజేసింది. ఈ ఉత్తర్వులు వెలువడడానికంటే ముందే సదరు న్యాయమూర్తిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్టు సమాచారం.
రూస్ అవెన్యూ కోర్టు క్యాబిన్‌లో మహిళా ఉద్యోగితో ఓ జడ్జి అభ్యంతరకరంగా ఆ వీడియోలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో వల్ల వ్యక్తుల గోప్యత హక్కుకు కోలుకోలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని జస్టిస్ యశ్వంత్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందకుండా ఆపాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. వీడియో వైరల్ కాంకుండా నిలుపు చేయాలని వీడియోలో కనిపిస్తున్న మహిళ తరఫున పిటిషన్ దాఖలైంది.
ఆ వీడియో కల్పితమని, సదరు మహిళ పిటిషన్‌లో పేర్కొంది. సోషల్ మీడియాలో వీడియో సర్కులేట్ కాకుండా నిరోధించేందుకు సోషల్ మీడియా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. కోర్టు లోని సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు అయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జిల్లా సెషన్స్ కోర్టు కూడా సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.