వాషింగ్టన్ : చైనా ప్రభుత్వ ఆధీనంలోని టిక్‌టాక్ విస్తరణ పట్ల అమెరికా గూఢచారి సంస్థ (ఎఫ్‌బిఐ) డైరెక్టర్ క్రిస్ వ్రే ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ఆధిపత్యంలో ఈ పాపులర్ మాధ్యమం ఉండటం తీవ్రస్థాయి విషయం అవుతోంది. అమెరికా విలువలను లెక్కచేయకుండా ఉండే చైనా ప్రభుత్వ వీడియో యాప్ ఎటువంటి సమస్యలను తీసుకువస్తుందనేది ఆలోచించాల్సిన పనిలేకుండానే అర్థం చేసుకోవచ్చునన్నారు. చైనా ఓ పద్ధతి ప్రకారం సంకల్పితంగానే యాప్‌లను తన అదుపులో పెట్టుకుని తగు విధంగా కాంటెంట్‌ను మలుస్తోందని, అవసరం అయినప్పుడు ఈ భావజాలాన్ని తనకు అనుకూలంగా వాడుకునేందుకు చైనా పావులు కదుపుతోందని, టిక్‌టాక్ ఇందులో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని ఎఫ్‌బిఐ డైరెక్టర్ తెలిపారు.
మనకు వ్యతిరేకంగా ఆలోచనలతో ఉండే చైనాకు అదుపాజ్ఞలలో ఉండే ఏ వ్యవస్థ అయినా ఇప్పటి దశలో అమెరికాకు ముప్పు కల్గించే విషయం అవుతుందని యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ గెరాల్డ్ ఆర్ ఫోర్డు స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ తెలిపారు. ఎఫ్‌బిఐ డైరెక్టర్ వెలువరించిన అంశాలపై స్పందించేందుకు టిక్‌టాక్ అధికార ప్రతినిధి ఎవరూ ముందుకు రాలేదు. టిక్‌టాక్‌ను ఇప్పుడు బీజింగ్‌కు చెందిన బైటేడాన్స్ నిర్వహిస్తోంది.