Sunday, November 24, 2024

ఇవాళ మహబూబ్ నగర్ కు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు మహబూబ్‌నగర్‌ ముస్తాబయ్యింది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గన బయలుదేరి మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. పట్టణ శివారులోని పాలకొండ వద్ద 22 ఎకరాల్లో రూ.55.20 కోట్లతో నిర్మించిన కొత్త కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి కొద్దిసేపు పార్టీ శ్రేణులతో ముచ్చటించనున్నారు. తర్వాత నేరుగా ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పరిశీలించారు.

కొత్త కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయం, బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులకు మంత్రి సూచనలు, సలహాలు చేశారు. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా పట్టణం గులాబీమయం అయ్యింది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రత్యేక విద్యుత్తు అలంకరణ చేపట్టారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐజీ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భారీగా జన సమీకరణ

కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ఉమ్మడి జిల్లా నుంచి లక్షా 50వేల మంది తరలించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి 90 వేల మందిని తరలించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల నుంచి మరో 60 వేల మంది ఈ సభకు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. బహిరంగ సభను విజయవంతం చేసి తెరాస సత్తా మరోసారి చాటాలని పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

పర్యటన కుదింపు.. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనను కుదించారు. తొలుత మహబూబ్‌నగర్‌ కొత్త కలెక్టరేట్‌, తెరాస పార్టీ కార్యాలయం, మినీ శిల్పారామం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి శంకుస్థాపన, మయూరి పార్కు సందర్శనతోపాటు బహిరంగ సభ ఉంటుందని భావించారు. సాయంత్రం తర్వాత కేసీఆర్‌ టూర్‌ను కుదించినట్లు జిల్లా నేతలు, అధికారులకు సమాచారం వచ్చింది. మినీ శిల్పారామం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మయూరి పార్కును షెడ్యూల్‌ నుంచి తీసేశారు. సీఎం పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌, భాజపా నేతలను ముందస్తు అరెస్టు చేసి ఠాణాల్లో ఉంచారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలు కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News