Monday, December 23, 2024

ధరల మాయలో పత్తి రైతులు!

- Advertisement -
- Advertisement -

 

ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబడులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా లేకపోవటం, బహిరంగ మార్కెట్‌లో దళారుల జోక్యం, సిండికేట్ వ్యాపారుల కుమ్మక్కు, పాలకుల విధానాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య నేడు మార్కెట్‌లో లభిస్తున్న పత్తి ధరలు రైతాంగంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాపితంగా 854.34 లక్షల ఎకరాల్లో పత్తి సేద్యం జరుగుతున్నది. భారత దేశంలో 226.65 లక్షల ఎకరాలకు సగటు పత్తి సాగు జరుగుతున్నది. సాగు విస్తీర్ణతలో మొదటి స్థానంలో ఉన్నా ఉత్పత్తిలో చాలా దిగువ స్థాయిలో ఉంది.

చైనా 60.75 లక్షల టన్నులతో మొదటి స్థానంలో ఉండగా, అమెరికా రెండవ స్థానంలో, భారత్ మూడవ, పాకిస్థాన్ నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సగటు ఉత్పత్తిలో చైనా ఎకరాకి 503 కిలోలతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా, పాకిస్థాన్‌లు రెండు, మూడ స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం ప్రపంచ సగటు కన్నా చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం (2021-22) భారత దేశంలో పత్తి సాగు విస్తీర్ణత 120.55 లక్షల హెక్టార్లగా ఉంటే ఈ సంవత్సరం 128 లక్షల హెక్టార్లగా, 350 లక్షల బేల్ల ఉత్పత్తిగా కాటన్ కార్పొరేషన్ అంచనా వేస్తున్నది. వాతావరణం అనుకూలిస్తే 370-75 లక్షల టన్నులకు, అనుకూలించకపోతే 325 లక్షల బేల్లకు పరిమితమవుతుందని, 2022 -23 (అక్టోబర్- సెప్టెంబర్) సంవత్సరంలో పత్తి 15% పెరుగుతుందని కూడా వెల్లడించింది.

అంతర్జాతీయ ఏజన్సీలు 2022-23లో ప్రపంచ వ్యాపితంగా పత్తి ఉత్పత్తి తగ్గుతుందని తెలిపాయి. దేశంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పత్తి సాగు జరుగుతున్నది. దేశవాళీ విత్తనాల స్థానే సస్యవిప్లవం పేరుతో అధిక దిగుబడుల కోసం అంటూ 1965లో పత్తి సాగులో హైబ్రీడ్ విత్తనాలు ప్రవేశించాయి. ఈ విత్తనాల వలన కొంత మేర దిగుబడి పెరిగినా, విత్తనాల ఖర్చు, ఎరువుల, పురుగు మందుల వాడకం వలన పంట ఖర్చు పెరగటంతో రైతాంగానికి మిగులు ఊరట లభించ లేదు.

1963- 70 మధ్య ఎకరా పత్తి సాగుకి 1625 రూపాయలు సేద్యపు ఖర్చులు కాగా 2001- 02 లో 16,900లకు పెరిగింది. నేడు సేద్యంలో 90% బిటి పత్తి విత్తనాల వినియోగం జరుగుతున్నది. కౌలు ఖర్చు కలుపుకుని రూ. 60 వేలకు సేద్యపు చేరుకుంది. దేశ సగటు దిగుబడి ఎకరాకు 6 క్వింటాళ్లు. ఆంధ్రప్రదేశ్ లో ఏటా 15.37 లక్షల పత్తి సాగు జరుగుతుండగా ఈ సంవత్సరం 16.32 ఎకరాల్లో రైతాంగం సాగు చేయగా, తెలంగాణలో 15 లక్షల ఎకరాల్లో రైతాంగం సేద్యం చేశారు. రెండు రాష్ట్రాల్లో కౌలుతో 70 వేల దాకా ఎకరాకు పంట ఖర్చు అవుతున్నది. సగటు దిగుబడి 8 క్వింటాళ్లు. 1970లో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా పత్తికి మద్దతు ధర ప్రకటించింది.

ఏనాడు రైతాంగ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు మద్దతు ధరలను ప్రకటించ లేదు. మద్దతు ధరలు రైతాంగానికి ముఖ్యంగా కౌలు రైతాంగానికి తీవ్ర నష్ట దాయకంగా ఉంది. ఈ సీజన్ లో పొడుగు గింజ పత్తి క్వింటాల్‌కు మద్దతు ధర 6,380, ఎంసిహెచ్ గా పిలిసే మధ్యరకం పత్తికి 6,280 రూపాయలగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మద్దతు ధర ప్రకారం 8 క్వింటాల్లు దిగుబడి వచ్చినా సొంత భూమి రైతుకు పెట్టుబడి వచ్చినా కౌలు రైతుకు నష్టమే మిగులుతుంది. ఎప్పుడు, ఎలా పత్తి ధర ఉంటుందో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారు. 2022 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని మార్కెట్‌లో క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ. 10,036, కనిష్ఠంగా 7,290 ధర లభించింది. ప్రైవేట్ వ్యాపారులు కూడా గ్రామాల్లోకి వెళ్లి 9 వేలకు కొనుగోలు చేశారు.

క్రమంగా పత్తి ధర తగ్గుతూ వచ్చింది. నవంబర్ 17 20-22న వరంగల్ మార్కెట్ లో 8,199 రూపాయలు మాత్రమే ధర ఉన్న పత్తి రెండు రోజుల వ్యవధిలో రూ. 7,800 పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ కూడా పత్తి ధర తగ్గుతూ నేడు రూ. 5,500 మాత్రమే బహిరంగ మార్కెట్‌లో రైతుకు ధర లభిస్తున్నది. పత్తికి మద్దతు ధర తక్కువగా ప్రకటించాలని, టెక్స్‌టైల్ పరిశ్రమ ప్రయోజనాలు కాపాడాలని, దాని అసోసియేషన్ పాలకులపై నిరంతరం వత్తిడి చేస్తూనే ఉన్నారు. అందుకు తలొగ్గుతూ ఏ పార్టీ ప్రభుత్వమైనా పత్తి మద్దతు ధరలను జౌళి పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రకటిస్తున్నది. పత్తి సేకరణలో కూడా బట్టల మిల్లు యజమానులు ద్వంద్వ విధానాలు అనుసరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధర ఎక్కువగా ఉన్నప్పుడు భారతదేశం నుంచి పత్తి ఎగుమతి చేయరాదని పాలకులపై వత్తిడి చేస్తూ, ప్రపంచ మార్కెట్లో ధర తగ్గినప్పుడు విదేశాల నుంచి దిగమతి చేసుకుంటున్నారు.

ఈ విధంగా రైతాంగ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారు. ఫలితంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.
దేశంలో కట్టుకోవటానికి బట్టలేని అభాగ్యలు కోట్లాది మంది ఉన్నారు. వారందరికీ వస్త్రాలు అందుబాటులోకి వస్తే దేశంలో ఇప్పుడు జరుగుతున్న పత్తిని రెట్టింపు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎగుమతులపై ఆధారపడాల్చిన అవసరం ఉండదు. పాలకులు అలాంటి విధానాలు అమలు జరపకుండా ఎగుమతి వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధరను బట్టి దేశం నుంచి ఎగుమతులు ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ కన్నా మన దేశ పత్తి ధర తక్కువగా ఉన్నప్పుడే ఎగుమతులు జరిగి ఎక్కువ ఉన్నప్పుడు ఎగుమతి స్తంభిస్తున్నది. ప్రపంచ మార్కెట్లో ఇతర దేశాలతో భారత పత్తి పోటీ పడలేకపోతున్నది. అందుకు పత్తి రేటు ఎక్కువగా ఉండటమే.

అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పత్తి రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాయి. అమెరికా మొత్తం పత్తి ఉత్పత్తి విలువ 2 వందల కోట్ల డాలర్లు. అంతకు మించిన సబ్సిడీ రైతులకు అందుతున్నది. పెద్ద ఎత్తున అందుతున్న సబ్సిడీతో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల పత్తిని ప్రపంచ మార్కెట్లలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆ దేశాల పత్తితో భారత పత్తి పోటీ పడలేకపోతున్నది. పత్తి ఎగుమతులు అక్టోబర్ – జనవరి కాలంలో దేశం నుంచి ఎక్కువగా జరుగుతుంది. 2022-23 సీజన్‌లో పత్తి ఎగుమతి 30 లక్షల బేల్లుగా కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనాగా ఉంది. గత సీజన్ కంటే ఇది 30% తక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో భారత పత్తి ధర కన్నా 5 నుంచి 7% వరకు ధర తక్కువగా ఉండటంతో వియత్నాం, బంగ్లాదేశ్‌లు అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటున్నాయి.

బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధరకు సిసిఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయాలి. ఆ పాత్రను సిసిఐ ఎప్పుడూ సక్రమంగా నిర్వర్తించ లేదు. నామమాత్రంగా కొనుగోలు చేయటానికి కూడా అనేక వంకలు చెప్పి మద్దతు ధరను తగ్గిస్తున్నది. అదే పత్తిని వ్యాపారులు తీసుకుని వెళితే పూర్తి మద్దతు ధరకు కొనుగోలు చేసింది. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పత్తి కొనుగోలు విషయంలో చేతులెత్తి వేసేందుకు సిద్ధమవుతున్నది. పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటలకే ఎక్కువగా పరిమితమవుతుంది. ఏర్పాటు అయినా చాలా కేంద్రాలు అలంకారప్రాయంగానే ఉన్నాయి.
తెలంగాణలో 83 సిసిఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు ప్రారంభమైనట్లు, కార్డుల జారీ ద్వారా కొనుగోల్లు పారదర్శకంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 61 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని వైసిపి ప్రభుత్వం ప్రకటించింది. సిసిఐలో పత్తి విక్రయానికి ముందుగా రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ (విఎఎ) వద్ద రైతాంగం పేర్లు నమోదు చేసుకుంటే వారి స్లాట్ నంబర్ కేటాయింపు జరుగుతుంది.

వారికి కేటాయించిన సమయంలో జిన్నింగ్ మిల్లులకు, మార్కెట్ యార్డులకు పత్తిని రైతాంగం తీసుకు వెళ్లాలి. తేమ శాతం 12% మించకుండా ఉంటే మద్దతు ధర లభిస్తుందని, మించితే రాదని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఒక్కో రైతు నుంచి ఎంత మొత్తం పత్తిని కొనుగోలు చేసేది చెప్పలేదు. కార్డులు కేటాయించిన, పేర్లు నమోదు చేసినా ముందుగా రెండు రాష్ట్రాల్లో పత్తిని సిసిఐ కేంద్రాలకు తీసుకు వెళ్లేది అధికార పార్టీలకు చెందిన రైతాంగమే అనటంలో సందేహానికి తావు లేదు. చిన్న, సన్న కారు రైతులకు ఆఖర్లోనే అవకాశం వస్తుంది. కుటుంబ అవసరాల కోసం అప్పటికే వారు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితులున్నాయి. రైతు భరోసా కేంద్రాలకు తీసుకువెళ్లినా అనేక వంకలతో వీరికి మద్దతు ధర కూడా ఇవ్వరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను రైతాంగం అర్ధం చేసుకోవాలి. పత్తికి క్వింటాల్ మద్దతు ధర రూ. 10 వేలు ప్రకటించి నేరుగా మొత్తం పత్తిని రైతాంగం నుంచి సిసిఐ కొనుగోలు చేయాలని, నిబంధనలు సడలించాలని రైతాంగం ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News