Sunday, November 24, 2024

ఆదర్శంగా నిలిచావమ్మా!

- Advertisement -
- Advertisement -
లాలూ కుమార్తెను మెచ్చుకున్న బిజెపి నాయకులు

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్(74)కు సోమవారం సింగపూర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ విజయవంతం అయింది. ఆయన కూతురు రోహిణి ఆచార్య(40పడిలో ఉన్న) ఆయనకు తన కిడ్నీని దానం చేసి ఆదర్శంగా నిలిచింది. సర్జరీ విజయవంతం అయ్యాక లాలూ యాదవ్, ఆయన కూతురు రోహిణి కోలుకుంటున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్నీ ఇవ్వాలనుకోవడం కూడా చాలా రిస్కీ నిర్ణయం. అయినప్పటికీ తండ్రి కోసం ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. దీనిని బిజెపి ఫైర్ బ్రాండ్ నాయకుడు గిరిరాజ్ సింగ్ కూడా శ్లాఘించారు. నిజానికి ఆయన లాలూను తీవ్రంగా విమర్శించే విమర్శకుడు. అలాంటి ఆయనే “రోహిణి ఆచార్య ఓ ఆదర్శవంతమైన కూతురు. నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. భవిష్యత్తు తరానికి నీవు ఓ ఉదాహరణ” అని ట్వీట్ చేశారు.

బిజెపి పార్లమెంటు సభ్యుడు నిశికాంత్ దుబే కూడా రోహిణిని శ్లాఘించారు. “నాకు కూతురు లేదు. నేడు రోహిణి ఆచార్యను చూశాక, నాకు కూడా అలాంటి కూతురును ఇవ్వమని ఆ దేవుడితో పోట్లాడుతాను” అని  ట్వీట్ చేశారు.

 

లాలూ పెద్ద కూతురు మీసా భారతి నిన్న సాయంత్రమే సర్జరీ తర్వాతి అనేక ఫోటోలు ట్విట్టర్‌లో షేర్ చేశారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా హాస్పిటల్ నుంచి అప్‌డేట్ ఇచ్చారు. తేజస్వీ యాదవ్ తన ట్వీట్‌లో “ నాన్నగారికి కిడ్నీ ఆపరేషన్ అయ్యాక ఆయనను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసియూకి మార్చారు. కిడ్నీని దానం చేసిన అక్క రోహిణి ఆచార్య, పార్టీ జాతీయ అధ్యక్షుడు.. ఇద్దరూ కోలుకుంటున్నారు. ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు. శుభాకాంక్షలు” అంటూ ట్వీట్‌లో రాశారు.

 

కిడ్నీ దాత రోహిణి అయితే సర్జరీ కంటే ముందే తన తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘రాక్ అండ్ రోల్‌కు రెడీ. నాకు మంచి జరగాలని కాంక్షించండి’ అని ట్వీట్ చేసింది.

ఇదిలావుండగా బీహార్ వ్యాప్తంగా గుళ్లలో ‘యజ్ఞం’ మొదలుకొని ‘మృత్యుంజయ్ జపం’ వరకు హోమాలు, పూజలు జరిగాయి. అంతా లాలూ యాదవ్ క్షేమాన్ని కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News