Saturday, November 23, 2024

మ్యాన్ ఆఫ్ ది ఇయర్ జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు స్ఫూర్తిగా నిలిచిన ఆ దేశాధ్యక్షులు వోలోడిమిర్ జెలెన్‌స్కీని 2022 సంవత్సరపు మేటి వ్యక్తిగా టైమ్ మేగజైన్ ప్రకటించింది. రష్యా ఆక్రమణ పట్ల ప్రదర్శిస్తున్న తీవ్రస్థాయి ప్రతిఘటనకు గుర్తింపుగా జెలెన్‌స్కీని పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంచుకున్నట్లు పత్రిక తెలిపింది. ప్రస్తుత యుద్ధ తీవ్రస్థాయి పరిణామాల దశలోనూ ప్రెసిడెంట్‌గా దేశ బాధ్యతలు తీసుకుని, ఆయన రాజధాని కీవ్‌లోనే ఉండాలని నిర్ణయించుకుని, సైన్యానికి ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పిస్తూ స్ఫూర్తిని అందించినందున ఈ గుర్తింపు ప్రకటించినట్లు టైమ్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎడ్వర్డ్ ఫెల్సెన్‌తల్ తెలిపారు. తన అనుభవంలో ఇది అత్యంత చిరస్మరణీయ ఘట్టంగా ఉంటుందని చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దాడి ఆరంభించినప్పటి నుంచి జెలెన్‌స్కీ ప్రజలకు ధైర్యం కల్పిస్తూ ప్రసంగించడం, వీటిపై ఉక్రెయిన్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పౌరులు దృష్టి సారించడం వంటి పరిణామాలను టైమ్స్ ఉదాహరించింది. తరచూ యుద్ధ క్షేత్రాలకు వెళ్లడం, సైన్యంతో కలిసి గడపడటం, ఇటీవల అత్యంత కీలకమైన దక్షిణ ప్రాంతపు నగరం ఖేర్సాన్ నుంచి రష్యా సేనలు వైదొలిగిన క్రమంలో అక్కడి వీధులలో జనంతో కలిసి ఉత్సవాలు నిర్వహించడం వంటి పరిణామాలను కీలక అంశాలుగా ఈ మేగజైన్ పరిగణనలోకి తీసుకుంది. ఆయన అనుసరించిన సమాచార ప్రక్రియతో భౌగోళికరాజకీయ ప్రక్రియలో తీవ్రస్థాయిలో మార్పులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కార్యాచరణకు రంగం సిద్ధం అయిందని ఎడిటర్ ఇన్ చీఫ్ విజేతను ప్రకటిస్తూ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News