సిమ్లా: భారతీయ జనతా పార్టీ(బిజెపి) అభ్యర్థి రాకేశ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర్ నగర్ నియోజకవర్గం నుంచి గురువారం గెలుపొందారని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. ఆయన మొత్తం 29432 ఓట్లతో ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి సొహన్ లాల్‌కు 21307 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అభిషేక్ ఠాకుర్‌కు 14704 ఓట్లు వచ్చాయి.
ఎన్నికల సంఘం వెల్లడించిన తాజా పరిణామాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని 68 సీట్లలో ఒక్క సీటును గెలుచుకుని, 26 స్థానాలలో ఆధిక్యతతో బిజెపి కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ ఇప్పటికీ 38 సీట్లలో ఆధిక్యతను కనబరుస్తూ దూసుకెళుతోంది. కాగా మూడు అసెంబ్లీ సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
ముఖ్యమంత్రి జైరామ్ ఠాకుర్ ప్రస్తుతం సెరాజ్‌లో 37227 ఓట్లతో ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన చేత్ రామ్ ఇప్పటి వరకు 9755 ఓట్లతో కొనసాగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని 59 ప్రాంతాల్లో 68 కౌంటింగ్ హాల్స్‌లో లెక్కింపు కొనసాగుతున్నది. హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి, కాంగ్రెస్, ఆప్, బిఎస్‌పి, సిపిఐ(మార్కిస్ట్), సిపిఐ, రాష్ట్రీయ దేవ్‌భూమి పార్టీ (ఆర్‌డిపి) బరిలో ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తామే గెలుస్తామని చెప్పుకుంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్‌లో ప్రభుత్వాలు మారిపోతుండడం ఓ ఆచారంలా తయారయింది. ఒకవేళ బిజెపి గెలిస్తే అప్పుడు యాంటీఇన్‌కంబెన్సీ(ప్రభుత్వ వ్యతిరేకత)ను అది దెబ్బతీసినట్లవుతుంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం అనే ట్రెండ్‌ను సమాప్తం చేయగలదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బిజెపి 44 సీట్లు గెలువగా, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంది.