బెంగళూరు: పోలీసు స్టేషన్ల పట్ల సామాన్య ప్రజలకున్న భయాలను, అపోహలను తొలగించేందుకు బెంగళూరుకు చెందిన ఒక పోలీసు అధికారి ఒక వినూత్న ఆలోచనను ఆచరణలో పెట్టారు. పోలీసులు, సందర్శకులకే కాక సామాన్య ప్రజల కోసం పోలీసు స్టేషన్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలన్న తన ఆలోచనకు పోలీసు డిప్యూటీ కమిషనర్(ఆగేయ) సికె బాబా శ్రీకారం చుట్టారు. బెంగళూరు నగరంలోని ఏడు పోలీసు స్టేషన్లలో ప్రజా గ్రంథాలయాలను ప్రారంభించిన ఆయన మరి కొద్ది రోజుల్లోనే మరో ఆరు గ్రంథాలయాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 1న కర్నాటక రాజ్యోత్సవ ఉత్సవాల సందర్భంగా కోరమంగళ, మైకో లేఔట్, ఎలెక్ట్రానిక్స్ సిటీ పోలీసు స్టేషన్లలో గ్రంథాలయాలను ఆయన ప్రారంభించారు. వీటితో హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, హులిమావు, బొమ్మనహళ్లి, పరప్పన అగ్రహార పోలీసు స్టేషన్లలో కూడా గ్రంథాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరుకల్లా బండెపాల్య, బెగూర్, సుద్దగుంటనపాల్య, మడివల, లడుగోడి, తిలక్‌నగర్ పోలీసు స్టేషన్లలో ప్రజా గ్రంథాలయాల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ లైబ్రరీలలో ఇంగ్లీష్, కన్నడ భాషలకు చెందిన వివిధ అంశాలకు చెందిన వంలాది పుస్తకాలు, దినపత్రికలు, అందుబాటులో ఉన్నాయి. స్వీయచరిత్రలతోపాటు, ఫిక్షన్ నవలలు, చారిత్రక నవలలతోపాటు పిల్లల కోసం కలరింగ్ పేపర్, కలర్ పెన్సిల్స్ ఈ గ్రంథాలయాలలో ఉన్నాయి. ఇక్కడి పుస్తకాలను ఇళ్లకు తీసుకెళ్లడానికి వీల్లేదు. ఇక్కడే కూర్చుని చదువుకునేందుకు వీలుగా కుర్చీలు బల్లలను ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్ ప్రాంగణంలో ఈ పుస్తకాలు చదువుకోవచ్చు. పోలీసు అధికారుల పట్ల, పోలీసుస్టేషన్ల పట్ల ప్రజలలో ఉన్న అభి అపోహలను మార్చేందుకే తాను ఈ ఆలోచనను అమలులోకి తీసుకువచ్చినట్లు డిసిపి బాబా చెబుతున్నారు.
ప్రజలు పోలీసు స్టేషన్‌కు ధైర్యంగా వెళ్లి తమ ఫిర్యాదులను అధికారులకు చెప్పాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో తన ఆలోచన పంచుకోగా ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందని, కొన్ని వందల పుస్తకాలను ప్రజలు విరాళంగా అందచేశారని ఆయన చెప్పారు. ఈ గ్రంథాలయాలు ఉన్న లొకేషన్లను గూగుల్ మ్యాప్స్‌లో జత చేశామని, ఏ ప్రాంతంలోని వారైనా గ్రంథాలయం కోసం సెర్చ్ చేస్తే సమీపంలోని పోలీసు స్టేషన్ అండుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు.