న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు క్రెడిట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకే దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూరంగా ఉండగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ మ్రాతం అవిశ్రాంతంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం సాగించారు.
పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రియాంక గాంధీ చరిష్మా పనిచేసిందని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రియాంక గాంధీ ఘోరంగా వైఫల్యం చెందినప్పటికీ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు మాత్రం ఈ సారి బిజెపిని ఓడించి కాంగ్రెస్‌కే పట్టం కట్టారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రియాంక అనేక ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ అగ్రనేత వీరభద్ర సింగ్ మరణానంతరం జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా రాజీవ్ శుక్లాను ప్రియాంక ఎంపిక చేసుకోవడం కూడా పార్టీ విజయానికి కలసి వచ్చిన అంశమని వర్గాలు పేర్కొన్నాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని సమకూర్చుకుంది.