Thursday, December 19, 2024

రవీందర్‌సింగ్ కూతురు పెళ్లికి సీఎం గిఫ్ట్..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్:కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌ను రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జీవో విడుదల చేశారు. సర్దార్ రవీందర్‌సింగ్‌కు గత కొంతకాలంగా కీలక పదవీ వస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగింది. సివిల్ సప్లయ్ రాష్ట్ర చైర్మన్‌గా ఉత్తర్వులు వెలువడగా ఆ చర్చకు తెర పడినట్లు అయ్యింది. రవీందర్‌సింగ్ మొదటి నుంచి రాజకీయాలు అంటే మక్కువతో న్యాయవాది వృత్తిని వదిలి రాజకీయాలలోకి రావడం జరిగింది. 1984లోనే కరీంనగర్ నగరంలో ఉన్న ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికైనారు. సర్దార్ రవీందర్‌సింగ్ దాదాపు 25 సంవత్సరాలకు పైగా నగరపాలక సంస్థలో వివిధ పాలక వర్గాలలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

మొదటిసారి ఇండిపెండెంట్‌గా 1995లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అలాగే 2001లో కూడా బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించి బీజేపీ ప్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే 2005 కూడా బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2000 సంవత్సరం నుంచి బీజేపీ కరీంనగర్ నగర శాఖ అధ్యక్షుడిగా 2007 వరకు పనిచేశారు. 2007లో బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2007 నుంచి కేసీఆర్ ఆదేశానుసారం కరీంనగర్ నగరంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు. 2008లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం అయ్యారు. 2014లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై నగర మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా రికార్డుకు ఎక్కారు.

మళ్ళీ 2020లో కార్పొరేటర్‌గా విజయం సాధించడంతో మొత్తం 5 సార్లు గెలిచి అందరికంటే సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2010లో టీఆర్‌ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం పాటు కరీంనగర్ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్ నగరంలో ఉదృతంగా నడిపించడంతో కేసీఆర్‌కి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నగరంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పని చేయడంతో కేసీఆర్ అనేక సందర్భంలో రవీందర్‌సింగ్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కేసీఆర్‌కి వారి కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్ రవీందర్‌సింగ్‌ను శాసనమండలికి పంపిస్తానని జిల్లా ప్రజాప్రతినిధులు పలుమార్లు చెప్పారు.

టీఆర్‌ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సర్దార్ రవీందర్‌సింగ్ మేయర్‌గా కరీంనగర్ నగరంలో ఒక్క రూపాయి మేయర్ ప్రసిద్ది పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచి భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందనలు కూడా అందుకున్నారు. కరీంనగర్ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంఘాలకు ప్రైవేట్ టీచర్ సంఘాలకు, క్రీడా సంఘాలకు, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం చైర్మన్ పదవి రావడంతో ఇటు పార్టీ వర్గాల్లో అటు అభిమానుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sardar Ravinder Singh appointed as Chairman of TSCSCL

కూతురు పెళ్లికి సీఎం గిప్ట్…
కరీంనగర్‌లో రవీందర్‌సింగ్ కూతురు వివాహానికి గురువారం హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపట్లోనే సర్దార్ రవీందర్‌సింగ్‌ను సివిల్ సప్లయ్ రాష్ట్ర చైర్మన్‌గా ఉత్తర్వులు వెలువడడంతో సర్దార్జీ కూతురి పెళ్లికి సీఎం గిప్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కొంతకాలంగా రవీందర్‌సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ఉన్నప్పటికి అనూహ్యంగా కరీంనగర్‌కు వచ్చిన సీఎం వెళ్తుండగానే ఉత్తర్వులు వెలువడడం గమనార్హం.

సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలుః
రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్‌గా నియమించినందుకు సర్దార్ రవీందర్‌సింగ్ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు తాను ఎళ్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. తన కూతురి పెళ్లి రోజు తనకు రాష్ట్ర పదవి రావడంతో ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు తనతో పాటు తన కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌కు ఎళ్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఒక ఉద్యమకారుడికి సరైన గుర్తింపు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

టీఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలు…
రాష్ట సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్ రవీందర్‌సింగ్ నియమితులు కాగా పార్టీ శ్రేణులు, అభిమానులు గురువారం సంబరాలు నిర్వహించి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నేత గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఒక ఉద్యమకారుడికి గుర్తింపు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News