Saturday, November 23, 2024

ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది: అధిర్ చౌదరి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం 2016 నవంబర్‌లో తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి తూర్పారబట్టారు. చివరికి నగదు చెలామణిలో కోరుకున్న లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం సాధించలేకపోయిందన్నారు. ఇప్పుడు నకిలీ కరెన్సీ నోట్లు ఇంకా పెరిగిపోయాయని విమర్శించారు. ఆయన చేసిన ఈ తీవ్ర విమర్శను లోక్‌సభలో బిజెపికి చెందిన నిశికాంత్ దుబే ఖండించారు. అవినీతిని అంతమొందించాలని, తీవ్రవాదులకు డబ్బు అందకుండా చేయాలన్న లక్ష్యంతో భారత రిజర్వు బ్యాంకే ఈ పెద్ద నిర్ణయం తీసుకుందన్నారు.

లోక్‌సభ శూన్యకాలంలో అధిర్ రంజన్ చౌదరి ఈ పెద్ద నోట్ల రద్దు(మానిటైజేషన్) అంశాన్ని లేవనెత్తారు. 2016లో నగదు చలామణి రూ. 18 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడది రూ. 31 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. నకిలీ కరెన్సీ కూడా పెరిగిపోయిందని, స్విస్ బ్యాంకులో డిపాజిట్లు కూడా పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. “భారత ఆర్థిక వ్యవస్థ చాలా దుర్భరంగా ఉంది. అది కూడా పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్) కారణంగా. నల్ల ధనాన్ని తీసుకొస్తామని, నకిలీ నోట్లను అరికడతామని, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేస్తామని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేశారు. కానీ వాటిలో ఏ ఒక్క లక్షం సాధించలేకపోయారు” అని అధిర్ రంజన్ చౌదరి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. కానీ బిజెపి నాయకుడు దుబే ఆయన వాదనను ఖండించారు. అది ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం అంటూ సమర్థించారు. పైగా కాంగ్రెస్ ఓ టుక్డే టుక్డే గ్యాంగ్ అని విరుచుకుపడ్డారు.

2016 నవంబర్ 9న రూ. 500, రూ. 1000 వంటి పెద్ద నోట్లను రాత్రికి రాత్రే రద్దు చేశారు. నల్ల ధనం, నకిలీ కరెన్సీ నివారిస్తాం, ఉగ్రవాదులకు డబ్బు అందకుండా చేస్తాం అన్న వాదనతో ఆ పని చేశారు. లక్షాన్ని అయితే ఆవగింజంత కూడా సాధించలేదు. కానీ నాటి నుంచి నేటి వరకు ప్రజలను ఏదో ఓ కొత్త ట్రిక్‌తో నానా యాతనలకు గురిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News