మన తెలంగాణ / హైదరాబాద్ : జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ నెల 16 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తాజా ప్రకటనలో పేర్కొంది. అప్లికేషన్ ప్రొఫార్మా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు రాత పరీక్ష జూన్ లేదా జులై 2023 ఉండవచ్చని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1392 పోస్టులను భర్తీ చేస్తారు. 27 సబ్జెక్టుల్లో మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా గత మూడు రోజుల నుంచి టిఎస్‌పిఎస్‌సి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. పాలిటెక్నిక్ లెక్చరర్స్ కు సంబంధించి 247, 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీ కి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇలా వరుస నోటిఫికేషన్‌లతో తెలంగాణలోని నిరుద్యోగుల్లో ఆనంద కోలాహలం కనపడుతోంంది.