మనతెలంగాణ/హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు ముస్తాబు అవుతున్నాయి. అందులో భాగంగా యాదాద్రి పునర్ నిర్మితమైన దివ్యాలయంలో వచ్చే నెల 2న తొలిసారి వైకుంఠ (ఉత్తర) ద్వార దర్శనోత్సవాన్ని నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. దైవ దర్శనం, ఆరాధనలకు అనుగుణంగా దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు నుంచే వార్షిక అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఆలయాల్లో అధ్యయనోత్సవాలకు ప్రాధాన్యం
వైష్ణవాచారంగా కొనసాగే ఆలయాల్లో అధ్యయనోత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా ఈ విశిష్ట పర్వాలను నిర్వహించడం క్షేత్ర సంప్రదాయం ఉంది. వచ్చే నెల 2 నుంచి ఆరు రోజులపాటు కొనసాగే ఉత్సవాల్లో అలంకార సేవలతోపాటు ప్రబంధ పఠనం నిర్వహిస్తారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనవరి 27 నుంచి మూడు రోజుల పాటు అధ్యయనోత్సవాలు, అదే నెల 31 నుంచి వారం రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.