Sunday, November 17, 2024

మార్పు కోసమే బిఆర్ఎస్

- Advertisement -
- Advertisement -

ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పుల కోసం బిఆర్‌ఎస్ పనిచేస్తుంది దేశంలో ఆర్థిక పరివర్తన రావాలి ఇందుకోసం
సరికొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తాం సహజ వనరులకు కొదువలేదు సద్వినియోగం చేస్తే అమెరికానూ
దాటవచ్చు ఎన్ని తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం రత్నగర్భ భారత్‌ను అభివృద్ధి
పరచలేమా? బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, మహిళా సాధికారత కోసం నూతన విధానాలు రావాలి విద్య,
వైద్యం తదితర రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణే స్ఫూర్తి దేశ ప్రజలు అవకాశమిస్తే రెండేళ్లలో
మారుమూల గ్రామాలకు 24గంటల విద్యుత్ ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు కర్నాటక ఎన్నికలతో
బిఆర్‌ఎస్ ప్రస్థానం ప్రారంభం జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్ :దేశంలో నెలకొన్న చీకట్లలో చిరుదీపం వెలిగించడమే బిఆర్‌ఎస్ లక్షమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసమే బిఆర్‌ఎస్ ఉద్భవించిందన్నారు. తెలంగాణ తరహా పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థ్ధిక వ్యవస్థను ఇండియా సృష్టించనుందన్నారు. అలా భారత్‌ను తయారుచేసే అ వకాశాన్ని ప్రజలు తమకిస్తే..ప్రతి క్షణం దేశ ప్రగతి కోసమే పనిచేస్తామన్నారు.తెలంగాణ భవన్‌లో శుక్రవారంనాడు బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, దేశంలో సమాఖ్య స్ఫూర్తి ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నియంతృత్వ ధోరణి పో వాలన్నారు. కొత్త ఆర్థిక, విద్యా, జల విధానాలను ప్రకటించాల్సి ఉందన్నారు. కేంద్రంలోని తరువాయి
ప్రస్తుత పాలకులపై దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు సరైన ప్రత్యామ్నాయం కోసం నిరీక్షిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలకు బిఆర్‌ఎస్‌కు ఆశాదీపంగా కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరబోయేది ముమ్మాటికి గులాబీ జెండానే అని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గులాబీ మానియా తప్ప…మరో మానియా పని చేయదన్నారు. దేశ సౌభాగ్యం కోసం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న దేశ రైతాంగం కోసం, ఉత్పత్తి కులాల, సబ్బండ వర్గాల సౌభాగ్యం కోసం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో బిఆర్‌ఎస్ ముందుకుపోతుందన్నారు. ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలె. ప్రజా ప్రతినిధులు గెలవాలన్నారు. సరిగ్గా ఇదే పరివర్తన కోసం ఏర్పాటైందే బిఆర్‌ఎస్ పార్టీ అని కెసిఆర్ అన్నారు.

ఎన్నో విమర్శలను అధిగమించి ఇంతదూరం వచ్చామన్నారు. ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతునే ఉంటాయన్నారు. దేశ గతిని మార్చేందుకు ఉద్భవించిన బిఆర్‌ఎస్ పతాకాన్ని ఎగుర వేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆనాడు పిడికెడు మందిమి వేలై, లక్షలై ఉప్పెనలా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. ఊహించని రీతిలో పాలనను అందిస్తూ దేశానికే మార్గదర్శనం చేస్తున్నామన్నారు. తెలంగాణ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నామన్నారు. ఇవాళ మన పార్టీ కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు, మంత్రులు, చైర్మన్లు, సర్పంచులుగా లక్షలాదిమంది నాయకత్వం తయారైందన్నారు.

తెలంగాణను సాధించుకున్న తర్వాత అనేక విప్లవాత్మక పథకాలతో దేశానికే మార్గదర్శకంగా నిలిచామన్నారు. కరోనా వంటి కష్టాలు వచ్చినా రాష్ట్రం మాత్రం అభివృద్దిలో వెనుకడుగు వేయలేదన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు అభివృద్దిలో వెనుకడుగు వేశాయన్నారు. కానీ రాష్ట్రంలో పూర్తిస్థాయి క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడపడంతో మంచి ఫలితాలు కన్పిస్తున్నాయన్నారు. ఈ విషయంలో దేశానికే తెలంగాణ స్పూర్తిగా నిలిచిందన్నారు. ఉద్యమ సమయంలో పాలమూరులో పల్లెల నుండి వలసలు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా మారిందన్నారు. ఉద్యమ సమయంలో పాలమూరులోని నడిగడ్డ ప్రాంతాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ ఆయన ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, రాజ్యసభ, లోక్ సభ పక్షనేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావుతో పాటు రాజ్యసభ, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, మేయర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని కార్పోరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నాయకులు, హర్యానా నుంచి గుర్నామ్ సింగ్, ఒడిస్సా నుండి అక్షయ్ కుమార్, హిమాంశు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
భారత్ ఒక అద్భుతమైన రత్నగర్భ
ఎన్నో ఇబ్బందులున్న తెలంగాణనే అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని కెసిఆర్ అన్నారు. భారతదేశం అద్భుతమైన రత్నగర్భ అని పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే ఏ దేశంలో లేని మానవనరులు మన దేశంలో ఉన్నాయన్నారు. 50 శాతం వ్యవసాయయోగ్యమైన భూమి దేశంలో ఉందన్నారు. నదుల్లో 70 వేల టిఎంసిల నీటి నిల్వలున్నాయన్నారు. అయినా కూడా రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. బకెట్ నీళ్ల కోసం చెన్నైవాసులు ఇబ్బంది పడే పరిస్థితులున్నాయని ఈ సందర్భంగా కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తీసిన సినిమా అద్భుత విజయాన్ని సాధించిందన్నారు. ప్రతి ఎకరానికి నీళ్లిచ్చినా 30 వేల టిఎంసిల నీళ్లు సరిపోతాయన్నారు. మంచినీళ్లు, పరిశ్రమలకు పదివేల టిఎంసిలు ఇస్తే ఇంకా కూడా సమృద్దిగా దేశంలో నీటి నిల్వలుంటాయని ముఖ్యమంత్రి కెసిఆర్ వివరించారు.
ఆర్ధిక ప్రగతి కోసం పనిచేస్తాం
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పు కోసం ఉన్నత స్థాయికి చేరుకునే ఆర్ధిక ప్రగతి కోసం బిఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని కెసిఆర్ అన్నారు. ఇలాంటి చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందన్నారు. ఇదే స్పూర్తితో పనిచేసి దేశ ప్రగతిలో భాగస్వామ్యం అవుతామని కెసిఆర్ పిలుపునిచ్చారు. దేశంలో అద్భుతమైన యువ సంపత్తి కూడా ఉందన్నారు. కానీ అది నిర్వీర్యమై పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని కెసిఆర్ ధ్వజమెత్తారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇది బిఆర్‌ఎస్ నుంచే ప్రారంభం కావాలన్నారు. ఇందులో భాగంగా దేశంలో భావజాల వ్యాప్తిని, దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉందన్నారు.
నూతన జాతీయ విధానాల అవసరం
ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముందని సిఎం కెసిఆర్ అన్నారు. వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం అవసరముందన్నారు. అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరగడం శోచనీయం. చెన్నై లాంటి మహానగరానికి బకెట్ నీళ్ళు దొరకని దుస్థితి ఏమిటి? ఇదే సమస్య పై బాలచందర్ లాంటి దర్శకుడు తన్నీర్ తన్నీర్ అనే సినిమా తీస్తే ఆ నీటి బాధకు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితులున్నాయి.

ఇటువంటి అసంబద్ధ విధానాలను సరిచేయాల్సి ఉన్నది. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నది. దిక్కుమాలిన ట్రిబ్యునల్స్ పేరుతో నీటి యుద్ధాలను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి బాగు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ కావాలన్నారు. ఈ దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నయి. అయినా పల్లె పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అందుకు నూతన విద్యుత్ పాలసీ కావాలన్నారు. ఆర్థికంగా ఉజ్వలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా ఫారిన్ ఎక్సేంజీ నిల్వలు ఎందుకు తరిగిపోతున్నాయని ప్రశ్నించారు. డాలర్ ముందు మన రూపాయి విలువ ఎందుకు వెలవెలబోతున్నదని నిలదీశారు.

అందుకోసం నూతన ఆర్ధిక విధానం అవసరమన్నారు.ఈ దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్నా.. పచ్చదనానికి కొరత ఎందుకున్నదన్నరు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో నూతన పర్యావరణ పాలసీ తేవాల్సి ఉందన్నారు. అదే సందర్భంలో ఈ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఇంకా జరగడం లేదన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, మహిళా వర్గాలకు అభివృద్ధి ఫలాలను ఈ దేశ పాలకులు అందించలేకపోతున్నారన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన విధానం రావాలన్నారు.దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలను అనేకరకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటు పడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉన్నదని కెసిఆర్ పేర్కొన్నారు.

దేశ ప్రగతిలో మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహి ళా సాధికారత విధానం కావాలన్నారు. అంతే కాకుండా, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ఆయా రంగాల్లో తెలంగాణ స్ఫూర్తితో వినూత్నమైన ప్రగతికాముక విధానాలను రూపొందించి బిఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. ఇందుకోసం ఈ విధివిధానాల రూపకల్పన కోసం మాజీ జడ్జీలు, ప్రముఖ ఆర్థిక, సామాజిక వేత్తలతో, మేధావులతో కసరత్తు కొనసాగుతున్నదన్నారు. పాలనలో నియంతృత్వ ధోరణి పోవాలి… ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలన్నారు. స్వయంపాలన విధానం అమలు కావాలన్నారు. దళిత, బహుజన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు కావాలన్నారు.
కర్నాటకతో బిఆర్‌ఎస్ ప్రస్థానం
రాబోయే కర్నాటక ఎన్నికల్లో జెడిఎస్ పార్టీకి బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతునిస్తూ ప్రచారంలో పాల్గొంటామని కెసిఆర్ స్పష్టం చేశారు. మన రాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ ఎంపీలు, శాససనభ్యులు పాల్గొంటారన్నారు. జెడిఎస్ పార్టీని గెలిపించి కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని ఈ సందర్భంగా కెసిఆర్ పిలుపునిచ్చారు. అందుకు తెలంగాణలో అమలవుతున్న విద్యుత్, వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర పథకాలను వారికి వివరిద్దామని సూచించారు. గతంలో కర్నాటక పోయినప్పుడు తాను చెప్పినట్టే కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. భగవంతుని కృపతో, మన పట్టుదలతో మరోసారి సిఎం అవుతాడనే విశ్వాసం తనకుందన్నారు. ఇలా బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయ ప్రస్థానం కర్నాటకతోనే ప్రారంభం అవుతుందని కెసిఆర్ ఉద్ఘాటించారు.
బిఆర్‌ఎస్ వెలుగుదివ్వెను దేశం న లుమూలలకు వ్యాపింపచేద్దామన్నారు.
14న కేంద్ర కార్యాలయం...
14న ఢిల్లీలో బిఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుందామని కెసిఆర్ తెలిపారు. ఆ రోజు నుంచి బిఆర్‌ఎస్ జా తీయ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యులంతా 13వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలన్నారు. మరో రెండు, మూడు నెలల్లో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనం పూర్తవుతుందన్నారు. అనంతరం అక్కడి నుంచే పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే పార్టీ విధానాలను రూపొందిస్తామన్నారు. ప్రధానంగా రైతుపాలసీ, జల విధానం రూపొందిస్తామమన్నారు. తెలంగాణ సాధన కోసం తాను ఒక్కడిగా బయలుదేరినప్పు డు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ తరహాలోన ఇప్పుడు కూడా అవనాలను తలెత్తుతాయన్నారు.

అయినప్పటికీ భయపడేది లేదన్నారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన త్రైలోక్య మోహన గౌరీ అమ్మవారి ప్రత్యేక పూజల్లో కెసిఆర్‌తో సహా పలువురు పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.టిఆర్‌ఎస్ పేరును బిఆర్‌ఎస్‌గా మారుస్తూ అక్టోబర్ 5న తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తొలి పలుకులతో బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసముందని తనకుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News