బెంగళూరు: మీటర్‌పై ఎక్స్‌ట్రా డబ్బులు అడిగినందుకు ఒక ఆటోడ్రైవర్‌పై మాజీ సైనికోద్యోగి ఒకరు రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు రివాల్వర్ గురి తప్పడంతో ఆటోడ్రైవర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన గత మంగళవారం బెంగళూరులో జరిగింది. యలహంక నివాసి అయిన శ్రీనివాస అనే 42 ఏళ్ల టోడ్రైవర్ ఈనెల 6న అంతపుర గేటు సమీపంలో ఉండగా 50 వయసులో ఉన్న ఒక వ్యక్తి వచ్చి అక్కడకు 5 కిలోమీటర్ల దూరంలోని గంటిగనహళ్లి గ్రామానికి తీసుకువెళ్లాలని అడిగాడు. మీటర్‌తో సంబంధం లేకుండా రూ. 200 ఇవ్వాలని శ్రీనివాస చెప్పడంతో ఆ వ్యక్తి సరేనని ఆటోలో కూర్చున్నాడు. అయితే ఆటో ఎక్కినప్పటి నుంచి ఆ వ్యక్తి తనను దారుణంగా తిట్టసాగాడని, కెంచెనహళ్లి గేటు వరకు తిడుతూనే ఉన్నాడని శ్రీనివాస పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఎందుకు తిడుతున్నారని తాను హిందీలో ఆగినందుకు ఆ వ్యక్తి వెనుకనుంచి తన తలపై కొట్టాడని శ్రీనివాస తెలిపాడు. ఆటో ఆపేసి తాను కిందకు దిగి ఎందుకు కొట్టావని ప్రశ్నించేలోగా ఆ వ్యక్తి తన బ్యాగులో నుంచి పిస్టల్ తీసి తనపై కాల్పులు జరిపాడని, అయితే అదృష్టవశాత్తు గురితప్పడంతో తాను బతికిపోయానని శ్రీనివాస చెప్పాడు. అయితే ఆ వ్యక్తి పిస్టల్‌తో తన తలపై బలంగా కొట్టాడని, ఇంతలో సమీప అపార్ట్‌మెంట్లలోని సెక్యూరిటీ గార్డులు వచ్చి తనను కాపాడారని శ్రీనివాస తెలిపాడు. ఆటోడ్రైవర్‌పై దాడి చేసిన మాజీ సైనికోద్యోగిని అశ్వని కుమార్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ఆయనకు పిస్టల్ లైసెన్సు ఉందని, రూ. 100 బాడుగకు ఒప్పుకున్న ఆటోడ్రైవర్ దారిలో రూ. 200 డిమాండ్ చేయడంతో తాను తిట్టానే తప్ప పిస్టల్‌తో కాల్పులు జరపలేదని నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.