కోరుట్ల: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇస్తే గడీల పాలన నుండి విముక్తి చేసి పేదోల్ల రాజ్యం తీసుకువస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్ గ్రామం నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ప్రారంభమై అయిలాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. గ్రామ పంచాయతీలలో చేపట్టే ప్రతి అభివృద్ది పనిలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని, ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదని అని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం అసలైన ప్రజా ప్రభుత్వం అన్నారు.
గత సంవత్సర కాలం నుండి గడీల పాలన విముక్తి కోసం మీ కోసం పాదయాత్ర చేస్తున్నానని అన్నారు. మీరంతా బిజెపి వైపు అడుగులు వేయాలని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బండి సంజయ్ సంగ్రామ యాత్ర అయిలాపూర్ కిషన్ రావుపల్లె మీదుగా కోరుట్ల పట్టణం చేరుకుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రముఖ్ కరండ్ల మధుకర్, నాయకులు సురభి నవీన్ రావు, సాంబారు ప్రభాకర్, జెఎన్ వెంకట్, పూదరి అరుణ, సునీత, పంచిరి విజయ్, గుగ్గిల్ల తుక్కారాం, అంబల్ల సుదర్శన్ దాసరి రాజశేఖర్, సుధవేని మహేష్, రాజమురళి తదితరులు పాల్గొన్నారు.