Monday, December 23, 2024

మాండస్ ఎఫెక్ట్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రమంతటా ముసురు పట్టింది. వానాకాలం సాగు చేసిన పంటలు చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వరికోతలు ఇంకా కొనసాగుతుండగానే వర్షాల ధాటికి వరిరైతు గజగజలాడిపోతున్నాడు. కోతలు కోసి పొలాల్లోనే ఆరబెట్టిన ధాన్యం కుప్పలను చినుకుల నుంచి కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తుపాన్ ప్రభావంతో వ్యవసాయ ఆధికారుల హెచ్చరికల మేరకు పలు జిల్లాల్లో రైతులు వరికోత పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షం పూర్తిగా తెరిపినిచ్చి వాతావరణం అనుకూలించాకే తిరిగి వరికోతలు ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరో వైపు ఇప్పటికే కోతలు పూర్తయిన ప్రాంతాలో కల్లాల్లోనే ధాన్యం ఆరబోశారు. చిరుజల్లులు పడుతుండటంతో ధాన్యం కుప్పలు తడవకుండా టార్పాలిన్లు కప్పిపెడుతున్నారు.దీంతో ధాన్యం ఆరే అవకాశం లేకుండా పోతోంది. ఎండకు గాలి పారకపోతే కుప్పలమీదనే ధాన్యం మగ్గి గింజ రంగుమారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా చలివాతావరణం కూడా పెరిగింది. ఈశాన్యభారతం నుంచి వస్తున్నచలిగాలుల తీవ్రత మరింత గుబులు పుట్టిస్తోంది. ధాన్యం విక్రయించేందకు కోనుగోలు కేంద్రాలకు చేరవేస్తే అక్కడ ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉందంటూ కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. ఎఫ్‌సిఐ నిబంధనలమేరకు రైతులు విక్రయానికి తెచ్చే ధాన్యంలో తేమశాతం 17కుమించి ఉండరాదు.

వరికోతలు ముగిసిన ప్రాంతాల్లో రైతులు యాసంగి సాగుకు వరినారుమళ్లు సిద్దం చేసుకుంటున్నారు.చలి తీవ్రత పెరగటంతో విత్తనం మొలక సరిగా రావటం లేదని, వరినారుమళ్లు కూడా ఎదుగుదల మందగిస్తోందని రైతులు చెబుతున్నారు. వానాకాలం సాగు చేసిన వేరుశనగ, మినుము , పెసర పంటలు కూడా అకాల వర్షాలతో దెబ్బతింటున్నాయి.
రంగు మారుతున్న పత్తి:
రాష్ట్రంలో వాతావరణం ముసురేసింది. తేమశాతం పెరగటం , చిరుజల్లులు కురుస్తుండటంతో పత్తి రైతుల్లో వణుకుపుడుతోంది. కాపుకొచ్చిన పత్తి తేమ తగిలి రంగు మారుతోంది. పత్తిలో నాణ్యత తగ్గితో మార్కెట్‌లో లాభసాటి ధర లభించదని రైతులు దిగులు చెందుతున్నారు. మిరపలో కూడా తెగుళ్ల బెడద అధికమవుతోంది. కాపుమీద మిరప పంటను కాపాడుకోవటం రైతులకు పెద్ద సమస్యగానే మారింది. చిరుజల్లుల వల్ల మిరపకాయ తొడిమల్లోకి నీరు చేరి కాయలు కుళ్లిపోతున్నాయంటున్నారు. ముందుగా సాగు చేసిన మిరప తోటలు ఇప్పుడిప్పుడే కోతకు వస్తున్నాయి.ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారటంతో దిగుబడి తగ్గుతుందని, కాయ నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు.
వణుకుతున్న మామిడి రైతులు:
అకాల వర్షాలు ఉద్యాన తోటలకు కూడా నష్టం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో మామిడి తోటలు పూత పిందే దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాండస్‌తుపాన్ ప్రభావం మామిడి తోటల రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వర్షాలకు పూత పింద రాలిపోతే ఈ ఏడాది కూడా పంటలు నష్టపోవాల్సివస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలి గాలుల తీవ్రతకు వాతావరణంలో పెరిగిన తేమ శాతం కూడా పూతను రాల్చేస్తుందంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News