వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ కమిటీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వ పదవికి రాజీనామాచేశారు. ఈ మేరకు ఆమె టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎఐసిసి వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు తనకు అసంతృప్తిని కలిగించాయని ఆమె రాశారు. తెలంగాణ రాజకీయ వ్యవహారాలలో తన పేరు లేదని, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ నాయకుడి పేరు లేకపోవడం మనస్తాపం కలిగించిందని సురేఖ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనకంటే జూనియర్లను కమిటీ సభ్యులుగా నియమించడం బాధ కలిగించిందన్నారు. తనను తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా నియమించడం అవమానకరంగా భావిస్తున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం ముఖ్యమని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీలోనే సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
కొండా సురేఖ మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో పరకాల, శాయంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి ఎంఎల్‌ఏగా గెలిచారు. ప్రస్తుతానికి ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ, త్వరలో పార్టీ మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొండా సురేఖ, భర్త కొండా మురళీ తమ కుమార్తె సుష్మితా పటేల్‌ను రాజకీయాల్లోకి తీసుకురావలనుకుంటున్నట్లు తెలిసింది.