న్యూఢిల్లీ: బిజెపి ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి విలువ పతనంపై ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని దుయ్యబ్టటారు. స్వాతంత్య్రం తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం చేసిన అప్పులు రూ. 55,87,149 కోట్లుగా ఉందని 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.80,00,744 కోట్లు చేసిందని ధ్వజమెత్తారు. 67ఏళ్లలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పుల కంటే.. కేవలం ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ అని మండిపడ్డారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో భారతీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందన్నారు.
డాలర్ తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని కోరారు. గతంలో రూపాయి విలువ 69కి పడిపోయినప్పుడు గుజరాత్ సిఎంగా ఉన్న మోడీ రూపాయి ఐసియులో పడిపోయిందన్నారు, కానీ ఇప్పుడు రూపాయి విలువ 82ను దాటిపోయిందని చురకలంటించారు. ఈ ఏడాది మొత్తం రూపాయి పతనం కొనసాగుతనే ఉందని, 2021 డిసెంబర్ నుంచి రూపాయి విలువ క్షీణించడం మినహా బలపడింది లేదని రేవంత్ తెలిపారు. బిజెపి అధికారం చేపట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ భారీగా పతనం చెందిందన్నారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే భారత్ కరెన్సీ పతనమే ఎక్కువగా ఉందని తెలియజేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 11.75 శాతం దేశీయ కరెన్సీ పతనమయ్యిందని, ఒకే ఏడాదిలో ఇంతగా క్షీణించడం ఇదే తొలిసారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.