హైదరాబాద్ : అర్ధరాత్రి వేళ రోడ్డు మీదికి వచ్చినందుకు రూ.3 వేలు జరిమానా కడతారా.. లేక రూ.వెయ్యి ఇచ్చి గప్‌చుప్‌గా ఇంటికెళ్లిపోతారా అంటూ ఓ యువ జంటను నడిరోడ్డుపై పోలీసులు ఆపేశారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లొస్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. డబ్బు కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. ఎంత బతిమిలాడినా వినక పోవడంతో గత్యంతరం లేక రూ.వెయ్యి లంచం ఇచ్చి వెళ్లిపోయారూ భార్యాభర్తలు. బెంగళూరులో ఈ ఘటన ఈ నెల 8న జరిగింది. దీనిపై తాజాగా బాధితుడు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కు ట్విట్టర్‌లో మొరపెట్టుకోవడంతో వివరాలు బయటకువచ్చాయి. ఆ రోజు రాత్రి పోలీసుల నుంచి తమకు ఎదురైన భయానక అనుభవాన్ని ట్విటర్‌లో వివరిస్తూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.దంపతుల్ని వేధింపులకు గురిచేసిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని మాన్యతా పార్క్ ఏరియాలో ఈ నెల 8న అర్ధరాత్రి కార్తిక్ పాత్రి తన భార్యతో కలిసి స్నేహితుల ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకలకు హాజరై తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఇంతలో ఓ పోలీస్ వాహనం వచ్చి వారి దగ్గర ఆగింది. అందులో నుంచి దిగిన ఇద్దరు పోలీసులు వీళ్ల ఐడి కార్డులు చూపాలని అడిగారు. మొబైల్ లో చూపించిన ఆధార్ ఫొటోలను చూసి, మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఒక పోలీస్ ప్రశ్నలు అడుగుతుంటే, మరో ఆఫీసర్ చలానా రాయడం మొదలుపెట్టాడు. చలానా ఎందుకని అడిగితే.. రాత్రి 11 తర్వాత రోడ్లపైకి రావడం నేరమని రూల్ ఉందని దబాయించాడు.
ఈ తప్పు చేసినందుకు రూ.3 వేలు కట్టాలని రశీదు చేతిలో పెట్టాడు. ఈ రూల్ గురించి తమకు తెలియదని, తమను వదిలిపెట్టాలని భార్యాభర్తలు ఇద్దరూ వేడుకున్నా వినిపించుకోలేదు. జరిమానా కట్టకుంటే ఇద్దరినీ అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు. ఆ ఇద్దరు పోలీసులలో ఒకరు పక్కకు పిలిచి రూ. వెయ్యి ఇచ్చేసి వెళ్లిపొమ్మని, సమస్యను పెద్దగా చేసుకోవద్దని బెదిరించాడని బాధితుడు చెప్పాడు. గత్యంతరం లేక పేటియం ద్వారా రూ.వెయ్యి ట్రాన్స్ ఫర్ చేసి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లిపోయానని బాధితుడు వివరించాడు. తను ఎదుర్కొన్న ఇబ్బందిని పేర్కొంటూ బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌కు మరుసటి రోజు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు.
జరిగిన సంఘటనను 15 ట్వీట్లలో వెల్లడించాడు. మాన్యతా పార్క్ కు చెందిన కార్తిక్ పాత్రి ట్వీట్ పై స్పందించిన కమిషనర్.. జరిగిన సంఘటనపై విచారణ జరిపి, ఆ పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాత్రికి జవాబిచ్చారు. ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ధైర్యంగా సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు పాత్రిని మెచ్చుకున్నారు. ఇలాంటి అనుభవం ఎవరు ఎదుర్కొన్నా సరే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని నగర పోలీస్ డిప్యూటీ కమిషనర్ కోరారు.