సమాచార హక్కుకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశ వ్యాప్తంగా పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో 17 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం దిగి వచ్చి 2005 అక్టోబర్ 12 నుండి సమాచార హక్కు చట్టంను అమల్లోకి తెచ్చింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పిస్తూ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రజలకు వెల్లడించవచ్చునని తెలిపింది. సెక్షన్ 8(1) నిబంధన ప్రకారం 10 విభాగాలుగా వర్గీకరించిన వివరాలను మాత్రం నిరాకరించవచ్చునని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొంది.
అధికార రహస్యాల చట్టం లేదా మరే చట్టాలు, ఇతర నిబంధనల ప్రకారం కూడా పౌరులకు సమాచారం ఇవ్వకుండా నిరాకరించరాదు అని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడినది. కానీ త్వరలో చట్ట రూపం దాల్చినున్న డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు- 2022 ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార హక్కు చట్టం, ఆధార్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టాల్ని సవరించాలని పేర్కొంది. ఇప్పటికే పలు సవరణలతో స.హ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 8(1) ను సవరిస్తే సమాచార హక్కు చట్టం స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజల చేతిలో పాశుపాతాస్త్రంగా మారిన ఈ చట్టం రెక్కలు తెగిన జటాయువుగా మారుతుంది.
వ్యక్తిగత సమాచార ముసాయిదా బిల్లు ఏం చెబుతుంది
దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి పరిరక్షించడమే లక్ష్యంగా డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు- 2022 ముసాయిదాను తయారు చేశారు. తాజాగా 81 సవరణలు 12 భారీ సూచనలతో దానికి మార్పులు చేపట్టి బిల్లును చట్ట రూపం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పౌర సమాజం, మేధావులు విద్యావేత్తల నుంచి ఈ డిసెంబర్ 17 వరకు కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని సమాచార గోప్యత కింద పరిగణించాలి. అలాగే ఇతరత్రా కారణాలతో వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయడం విక్రయించడం నేరం. మత, రాజకీయ విశ్వాసాలు, ఆర్థిక, ఆరోగ్య గణాంకాలు కులం లేదా మతం, బయోమెట్రిక్ సమాచారం వంటి అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారం తెలుసుకోవాలంటే స్పష్టమైన అనుమతులు ఉండాలి. జాతీయ భద్రత నేర దర్యాప్తు న్యాయ విచారణల్లో గోప్యత ఉంటుంది. ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరిచినట్లు ప్రభుత్వం నిర్ధారిస్తే వారిపై గరిష్టంగా రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వ్యక్తుల సమాచారాన్ని వారికి ఇబ్బంది కలగకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉపయోగించాలి. ఈ బిల్లులోని నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు జరిగేలా చూసేందుకు భారత సమాచార పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేస్తామని ఈ బిల్లులో పేర్కొన్నారు.
సమాచార హక్కుకు తాళం వేసినట్లే
సమాచార హక్కు చట్టం సెక్షన్ 22 ప్రకారం అధికార రహస్యాల చట్టం- 1923, అమల్లో ఉన్న మరేదైనా చట్టం వల్ల అమల్లో ఉన్న పత్రంలో ఈ చట్టంతో పొసగని అంశాలు ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంటున్నది. ఇతరేతరమైన ఏ చట్టాలు, అధికారాలు చూపిగాని సమాచార హక్కు చట్టం పరిధుల్ని అతిక్రమించడానికి వీలులేదనీ ఈ సెక్షన్ స్పష్టంగా చెబుతుంది. కానీ త్వరలో చట్ట రూపం దాల్చినున్న డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు ముసాయిదాలోని సెక్షన్ 30(2) సమాచార హక్కు చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించింది. సహ చట్టంలోని సెక్షన్ 8(1) జె పూర్తిగా సవరించాలని ఈ చట్టం పేర్కొంది. ఇదే జరిగితే అధికార యంత్రంగాలు రకరకాల శాఖలు చెప్పి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా తిరస్కరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే అవినీతిపరులైన అధికారులు ప్రజల నిఘా పరిశీలన నుండి తప్పించుకోవచ్చు.
ప్రభుత్వ రికార్డులను పొందాలంటే ఆర్‌టిఐ చట్టం ఎందుకు కొరగాకుండా పోతుంది. సమాచారాన్ని బయటకు ఇచ్చే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల గోప్యత హక్కులు ప్రజాప్రయోజనాలు అనే వాటిని సెక్షన్ 8 లో పగడ్బందీగా సమతుల్యం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల గోప్యత హక్కులకు ఈ చట్టంలో రక్షణలున్నాయి. చట్టాన్ని సవరిస్తే ఆ సమన్వయం దెబ్బతింటుంది. ఈ ఒక్క కారణం చూపి రకరకాల షాకులతో సమాచారాన్ని తిరస్కరించవచ్చు. అంతిమంగా సమాచార హక్కు చట్టం స్ఫూర్తి దెబ్బ తింటుంది. ప్రజాస్వామ్య విలువలకు జవాబుదారీగా ఉండే ఇలాంటి చట్టాన్ని బలోపేతం చేయాల్సింది పోయి బలహీన పరిచేందుకు జరుగుతున్న కుట్రల్ని పౌర సమాజం, ఉద్యమకారులు పెద్ద ఎత్తున ప్రతిఘటించాలి. తప్పుడు భాష్యాలు చెప్పి సమాచారం తిరస్కరించి ఇలాంటి చట్ట సవరణలను అడ్డుకోవాలి.
అంకం నరేష్
6301650324