న్యూస్‌డెస్క్: గ్రేట్ బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఒక మసీదు పైకప్పుపై కొందరు మతోన్మాదులు పంది తలను ఉంచిన సంఘటన ఇక్కడి ముస్లిం వర్గాలలో కలకలం సృష్టించింది. దీన్ని విద్వేషపూరిత నేరంగా పోలీసులు పరిగణిస్తూ దర్యాప్తు చేపట్టారు. డిసెంబర్ 9న ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వస్తుండగా పైకప్పుపై పంది తల కనిపించింది. ముస్లిం ప్రజలలో భయోత్పాతం సృష్టించేందుకు ఎవరో ఈ నీచమైన చర్యకు పాల్పడ్డారని మసీదు ట్రస్టీలలో ఒకరైన తయ్యాబ్ మోహియుద్దీన్ బిబిసికి తెలిపారు. ఇది నిజంగా బాధాకరమైన సంఘటనని ఆయన అన్నారు. పంది మాంసాన్ని ముస్లింలు తినరని, ఈ కారణంగానే ఎవరో మతోన్మాదులు ఈ పని చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను భయపెట్టేందుకే వారు ఈ పనిచేశారని ఆయన అన్నారు. కాగా..ఇద్దరు వ్యక్తులు మసీదు పైకప్పును చేరుకుని పంది తలను అక్కడ ఉంచుతున్న దృశ్యాలు సిసి కెమెరాలలో రికార్డు కావడంతో వాటి ఫుటేజ్‌లను మసీదు ట్రస్టు సభ్యులు పోలీసులకు అందచేసింది.