చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. అయితే 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన గిల్‌ను తైజుల్ ఇస్లాం వెనక్కి పంపాడు. దీంతో 41 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే కెప్టెన్ రాహుల్ (22) కూడా పెవిలియన్ చేరాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (1) కూడా నిరాశ పరిచాడు. దీంతో భారత్ 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
పంత్ దూకుడు
ఈ దశలో చటేశ్వర్ పుజారాతో కలిసి వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. పుజారా తన మార్క్ బ్యాటింగ్ ముందుకు సాగగా, పంత్ దూకుడుగా ఆడాడు. చెలరేగి ఆడిన పంత్ 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. అయితే జోరుమీదున్న పంత్‌ను మెహదీ హసన్ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 64 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
Stumps on Day 1⃣ of the first #BANvIND Test!@ShreyasIyer15 remains unbeaten on 8⃣2⃣* as #TeamIndia reach 278/6 at the end of day's play 👌
Scorecard ▶️ https://t.co/CVZ44N7IRe pic.twitter.com/muGIlGUbNE
— BCCI (@BCCI) December 14, 2022
పుజారా, శ్రేయస్ పోరాటం
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌తో కలిసి పుజారా మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇటు శ్రేయస్, అటు పుజారా బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇద్దరు అసాధారణ పోరాట పటిమను కనబరుస్తూ ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. ఇదే క్రమంలో ఇద్దరు అర్ధ సెంచరీలను సయితం నమోదు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో పుజారా తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పుజారా 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 పరుగులు చేసి తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఔటయ్యాడు.
కాగా, శ్రేయస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 149 పరుగుల కీలకమైన పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్‌ను ఆడిన శ్రేయస్ అయ్యర్ 169 బంతుల్లో 10 ఫోర్లతో 82 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అక్షర్ పటేల్ (14) తొలి రోజు ఆట చివరి బంతికి ఔటయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో ఆరు వికెట్లకు 278 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం మూడు, మెహదీ హసన్ రెండు వికెట్లు తీశారు.