హైదరాబాద్ : దక్షిణాది విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 26 న రాష్ట్రానికి రానున్న రాష్ట్రపతి హైదరాబాద్‌లో బస చేయనున్నారు. దక్షిణాది విడిది కోసం ఏటా డిసెంబర్ చివర్లో రాష్ట్రపతి హైదరాబాద్ రావడం సంప్రదాయంగా వస్తోంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి ఈ నెల 30వ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం శ్రీశైలం, 28న భద్రాచలం, రామప్ప దేవాలయాలను ఆమె సందర్శించనున్నారు. అదే విధంగా 27న నగరంలోని కేశవ్ మెమోరియల్ సొసైటీ, 29న జి. నారాయణమ్మ కళాశాల, నేషనల్ పోలీస్ అకాడమీ, సమతాముర్తిని సందర్శించనున్నారు.
30న శ్రీరామచంద్ర మిషన్ నిర్వహించే కార్యక్రమంలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలతో రాష్ట్రపతి సమావేశం కానున్నారు. కొవిడ్ కారణంగా గడచిన రెండేళ్లలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. 2020, 2021లో రాలేదు. ఇటీవల రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ము దక్షిణాది విడిది, పర్యటన షెడ్యూల్‌ను ఖారారు చేశారు. ఈ నెల 26న హైదరాబాద్ వచ్చి 30 వ తేదీన తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాష్ట్రపతి రాకకు పకడ్బందీ ఏర్పాట్లు..
ఈ నెల 26న నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న దృష్టా.. పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.హరీష్ అధికారులను ఆదేశించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము రానున్నారని, ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 26న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకుంటారని వివరించారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన బొల్లారంలో రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారని తెలిపారు. హకీంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి రాక సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.