బీహార్‌లో కల్తీ సారా కరాళ నృత్యం అక్కడ ఆరేళ్ళుగా అమల్లో గల మద్యనిషేధాన్ని పదేపదే అపహాస్యం పాలు చేస్తున్నది. శరణ్ జిల్లాలో బుధవారం నాడు కల్తీ సారా తాగి 39 మంది దుర్మరణం పాలయ్యారని తాజా సమాచారం తెలియజేస్తున్నది. దీనిపై బుధవారం నాడు బీహార్ అసెంబ్లీలో జరిగిన వేడివాడి చర్చ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహోదగ్రుడై బిజెపి సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వరకు వెళ్ళింది. మీరు తాగి మాట్లాడుతున్నారని ఆయన వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎందరు ఎన్ని విధాలుగా అభ్యంతరం చెప్పినా, పాట్నా హైకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా నితీశ్ కుమార్ మద్య నిషేధం అమలును కొనసాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన 2016లో నిషేధ చట్టాన్ని తీసుకు వచ్చారు. రాష్ట్రమంతటా మద్యం అమ్మకాన్ని, వినియోగాన్ని ఆ చట్టం నిషేధించింది.
దానిని 2018లో ఒకసారి, 2012లో మరొకసారి సవరించారు. మొదటిసారి మద్యపానం చేసిన వారికి రూ. 50 వేలు జరిమానా వేసి, మూడు మాసాల ఖైదు శిక్ష విధించాలని తొలి చట్టం నిర్దేశించింది. అలాగే మళ్ళీ మళ్ళీ మద్యపానానికి పాల్పడేవారికి రూ. లక్ష జరిమానా, ఐదేళ్ళ జైలు శిక్షను ఉద్దేశించింది. తాజా సవరణలో ఈ కాఠిన్యతను తగ్గించింది. చట్టం కఠినంగా వున్నప్పుడు, కాఠిన్యత తగ్గినప్పుడు కూడా దాని ఉల్లంఘన ఆగలేదు. సాధారణంగా చవక మద్యం సేవించే నిరుపేద శ్రామిక జనం, నిషేధం అమల్లో వున్నప్పుడు దొంగచాటుగా తయారు చేసి అమ్మే నాటు సారా (కల్తీ)ను ఆశ్రయిస్తున్నారు. మత్తు గరిష్ఠ స్థాయికి చేరుకోడానికి దానిని అమితంగా తాగడంతో దురరణం పాలవుతున్నారు. బీహార్‌లో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు కల్తీ సారా తాగి 170 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం నాటి విషాదంతో ఈ సంఖ్య 200 దాటిపోయింది. నిషేధ చట్టంతో ఉల్లంఘనలు పెరిగిపోయి కోర్టుల్లో కేసులు అపరిమితంగా దాఖలవుతున్నాయి.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందాలోనే ఈ సంవత్సరారంభంలో కల్తీ సారాకు 13 మంది బలి అయ్యారు. హోళీ సందర్భంగా మూడు జిల్లాల్లో 30 మంది మృతి చెందారు. ఆగస్టులో ఇదే శరణ్ జిల్లాలో 11 మంది, దీపావళి సందర్భంగా 40 మంది మరణించారు. గత సంవత్సరంలో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. బతికి బయటపడిన వారి దృష్టి మందగిస్తున్నది. మత్తు తొందరగా, అతిగా ఎక్కడం కోసం సగం మరిగించి దించిన నాటు సారాను అమ్ముతున్నారు. ఇది ఊహించని ప్రాణ హాని చేస్తున్నది. మద్య నిషేధం లేని చోట్ల కూడా కల్తీ సారా కాటేస్తున్నది కదా అనే వాదన నిలబడేది కాదు. ఈ నిషేధం చట్ట విరుద్ధమైనదని, అమలు సాధ్యం కాదని, రాజ్యాంగ విరుద్ధమని 2016 లోనే పాట్నా హైకోర్టు తీర్పు చెప్పింది. అయినా వినిపించుకోకుండా నితీశ్ ప్రభుత్వం 2016 అక్టోబర్ 2న మరింత కఠినమైన చట్టాన్ని తీసుకు వచ్చింది. నితీశ్ ఆదర్శాన్ని సమర్థిస్తూ అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు 2017 జనవరి 21న అతి పెద్ద మానవ హారాన్ని నిర్వహించారు.
12760 కి.మీ నిడివి సాగిన ఈ హారంలో మూడు కోట్ల మంది పాల్గొన్నారని సమాచారం. మద్యపాన నిషేధం అతి గొప్ప ఆదర్శం అనడానికి వెనుకాడవలసిన పని లేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మ గాంధీ కూడా మద్యపానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిషేధించనందుకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శించారు. స్వతంత్ర భారత ప్రభుత్వం నిషేధానికి తొందరపడకుండా దానిని రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో చేర్చింది. గాంధీ పుట్టిన గుజరాత్‌లో నిషేధం తరచూ ఉల్లంఘనకు గురి అవుతూనే వుంటుంది. మద్య నిషేధం వల్ల మహిళల పట్ల హింస తగ్గుముఖం పడుతుంది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా వుండగా చట్టాన్ని సవరించి మరణ శిక్షను చేర్చినా ప్రయోజనం కనిపించ లేదు.
దొంగచాటు సారా అమ్మకం ప్రజల ప్రాణాలను బలిగొనడంతో పాటు ప్రభుత్వాల ఆదాయానికి గండి కొడుతున్నది. బీహార్ మద్య నిషేధ చట్టం, ముందు చూపు లేమితో తెచ్చిందని, రాష్ట్ర కోర్టులు ఈ కేసులతోనే నిండిపోతున్నాయని, జైళ్ళు కిక్కిరిసిపోతున్నాయని, పాట్నా హైకోర్టులోని 1415 మంది న్యాయమూర్తుల విధి నిర్వహణ కాలాన్నంతటినీ హరించి వేస్తున్నాయని గత ఏడాది డిసెంబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ వ్యాఖానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో ఎన్‌టిఆర్ ప్రభుత్వం తిరిగి విధించిన పూర్తి మద్య నిషేధం విఫలమై, 1997లో రద్దయిన సంగతి తెలిసిందే. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి వచ్చిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇప్పటికీ దానిని అమల్లోకి తేలేక నానాఅవస్థలు పడుతున్నది. తమిళనాడులో, మరి కొన్ని రాష్ట్రాల్లో మద్య నిషేధ వైఫల్యం జగమెరిగినదే. ప్రభుత్వాలు తీసుకు వచ్చే ఏ చట్టమైనా ప్రజల ప్రాణాల మీదికి వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత వాటిపై వుంది.