మెకానిజం వినియోగించేందుకు సముఖత
తజకిస్తాన్, క్యూబా, లక్సెంబర్గ్, సూడాన్‌లతో భారత్ చర్చలు
న్యూఢిల్లీ : అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహించేందుకు అమెరికా డాలర్, ఇతర పెద్ద కరెన్సీలను వినియోగడానికి బదులుగా రూపాయిని వినియోగించే వ్యాపార యంత్రాంగాన్ని ఇటీవల భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే భారతదేశానికి చెందిన రూపీ వ్యాపార పరిష్కార యంత్రాంగానికి మరిన్ని దేశాల నుంచి ఆసక్తి కనిపిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తజకిస్తాన్, క్యూబా, లక్సెంబర్గ్, సూడాన్ వంటి దేశాలతో భారత్ ఈ రూపీ యంత్రాంగంపై చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ యంత్రంగాన్ని ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా వినియోగిస్తోంది. ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) జూలైలో ఈ యంత్రాంగాన్ని రూపొందించింది. ఈ యంత్రాంగంలోకి డాలర్ల కొరత ఉన్న దేశాలను తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోందని ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక రూపాయి ఖాతాలను(వోస్ట్రో) తెరిచేందుకు నాలుగు దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే భారత్ భాగస్వామ్య బ్యాంకులు ఇంకా ఈ సౌకర్యాలను అందించడం లేదు. ఈ ఖాతాలను ప్రారంభించేందుకు ఆర్‌బిఐ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం ఉంది. మారిషస్, శ్రీలంక కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ రెండు దేశాల ప్రత్యేక వోస్ట్రో అకౌంట్లకు ఆర్‌బిఐ ఆమోదం తెలిపింది. రష్యాతో పాటు రూపాయిలో వ్యాపారానికి ఆర్‌బిఐ 12 వోస్ట్రో ఖాతాలకు గాను ఆయా బ్యాంకులకు ఆమోదం తెలిపింది.