Friday, December 20, 2024

మాచర్ల హింస.. 9మందిపై హత్యాయత్నం కేసులు

- Advertisement -
- Advertisement -

పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అలాగే బ్రహ్మారెడ్డిని ఏ1గా చేర్చారు. రేషన్ డీలర్ చల్లా మోహన్ ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్రహ్మారెడ్డి, బాబూఖాన్‌లు తమపై రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని చల్లా మోహన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో రాళ్లు విసిరితే తమపై దాడి చేశారని ఆయన ఫిర్యాదులో చెప్పారు.

మరో కేసులో మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురక కిశోర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పార్టీ కార్యాలయంపై దాడి, కార్ల ధ్వంసం, అపార్ట్‌మెంట్‌లో చొరబడి చేసిన విధ్వంసాల కారణంగా తురక కిశోర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా తురక కిశోర్, ఏ2గా చల్లా మోహన్‌లను చేర్చారు. ఎర్రం అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా, మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది. దీంతో వైసిపి, టిడిపి శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో టిడిపి ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు. వైసిపి కార్యకర్తల దాడుల్లో మాచర్ల మంటల్లో చిక్కుకుంది. మూడు గంటలకు పైగా ఈ దాడుల ఘటనలు కొనసాగాయి. టిడిపి నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టారు. ఇరువర్గాల కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం బాహాబాహీకి దిగారు. దింతో మొదలైన గొడవలు రాత్రికి పెచ్చుమీరిపోయాయి. రాళ్లు, కర్రలతో ప్రతీకార దాడులుగా మారాయి.

రాజకీయాల్లో గొడవలు కామన్: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్ధితులపై మాజీ మంత్రి, వైసిపి ఎంఎల్‌ఎ కొడాలి నాని స్పందించారు . రాజకీయాల్లో గొడవలు ఇదే తొలిసారి కాదని.. చివరిసారి కూడా కాదన్నారు. 75 ఏళ్ల వయసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బట్టలూడదీసి కొడతానని రోజూ అంటున్నారని నాని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన మాటలను మాచర్లలో టిడిపి నేతలు ఆదర్శంగా తీసుకుని వుంటారని కొడాలి నాని చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News