లీమా: దక్షణ అమెరికా దేశం పెరూలో ప్రస్తుతం కల్లోల రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. దేశ మాజీ అధ్యక్షులు పెడ్రో కస్టిలోను పదవీచ్యుతులను చేసి, అరెస్టు చేసిన తరువాత దేశంలో అశాంతి నెలకొని ఉంది. ప్రజలు వీధులలోకి వచ్చి దేశంలో వెంటనే సార్వత్రిక ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు తరచూ హింసాత్మకం అవుతున్నాయి. ఘర్షణలు చెలరేగడంతో పలువురు మృతి చెందడం, గాయపడటం వంటి ఘటనలతో ప్రజలకు కునుకు లేని స్థితి ఏర్పడింది. నూతన అధ్యక్షురాలు డినా బోలుర్టే పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని విధాలుగా యత్నిస్తున్నారు. తాము స్థానిక ప్రాంతీయ నేతలను కులసుకుని అన్ని విషయాలు చర్చిస్తామని తెలిపారు.
మరో వైపు ఇప్పటికే మెక్సికో పెరూతో సంబంధాలు తెంచుకుంది. ఈ మేరకు మెక్సికో అధ్యక్షురాలు ప్రకటన వెలువరించారు. గత వారమే దేశంలో అధ్యక్షుడిని పదవి నుంచి తొలిగించారు. అప్పటి నుంచి దేశంలోని దక్షిణ ప్రాంతాలలో నిరసనలు హింసాకాండలు చెలరేగుతున్నాయి. విధ్వంసకాండలు, పోలీసు స్టేషన్లకు నిప్పు పెట్టడం, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, ప్రభుత్వోద్యోగులపై దౌర్జన్యాలు వంటి ఘటనలు జరిగాయి. అయితే వచ్చే వారం క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో నిరసనలు నిలిచిపోతాయని అధికారులు భావిస్తున్నారు.