Friday, November 22, 2024

ఉపాధి హామీలో శ్రమ దోపిడీ!

- Advertisement -
- Advertisement -

2006లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆనాటి ప్రధాని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆర్ధిక పరిస్థితి పెరిగి పేదల బతుకుల్లో వెలుగులు విరాజిల్లుతాయని ఆనాటి యుపిఎ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి వంద రోజుల పని కల్పన లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కొద్ది నెలలకే పని కల్పనలోనూ, భృతిలోనూ వైఫల్యం ప్రారంభమైంది. నేడు దాని తీవ్రత పెరిగి పథకాన్ని రద్దు చేసే చర్యకు మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనుల కోసం 50 కోట్ల మంది అర్హులైన వారు ఉంటే 13 కోట్ల మందికే జాబ్ కార్డులు అందాయంటే పథకం ఏవిధంగా అమలు జరుగుతున్నదో ఆనాడే వెల్లడైంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ. 67 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇందులో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. 2020- 21 సంవత్సరంలో పథకానికి రూ. 61,500 కోట్ల నుంచి రూ. లక్షా 11 వేల కోట్లకు పెంచినట్లు మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. పథకానికి నిధులు పెంచామని చెప్పే మంత్రి, పెంచిన దాని ప్రకారం కూలీ దినాలు పెంచామని, అదనంగా పేదలకు జాబ్ కార్డులు ఇచ్చామని చెప్పలేదు.

కరోన కాలంలో రెండు వందల రోజులకు ఉపాధి పనులు పెంచాలని అనేక ప్రజా సంఘాలతో పాటు రాష్ట్రాలు కోరినా కేంద్రం స్పందించ లేదు. అసలు ఉపాధి పథకానికి కేటాయించిన దానిలో ఖర్చు పెట్టిన వివరాలు లేవు. ఏ సంవత్సరం 100 రోజుల పని కుటుంబానికి కల్పించలేదు. 2018 -19లో దేశంలో 26 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకుంటే వారిలో పని దొరికింది 11.79 కోట్ల మందికే. లభించిన రోజు సగటు కూలి 179 రూపాయలు. అనేక రాష్ట్రాల్లోని వ్యవసాయ కూలీల కనీస వేతన చట్టంలోని కూలి రేట్ల కన్నా ఇది చాలా తక్కువ. ఆ విధంగా కూలీల శ్రమశక్తి దోపిడీకి గురవుతున్నారు.
గ్రామీణ ఉపాధి పథకం పనులకు నిర్ణయించి కూలి రేట్లపై తీవ్ర విమర్శలు రావటంతో మోడీ ప్రభుత్వం 30- మార్చి -2022న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కూలి రేట్లను సవరించక తప్ప లేదు. సవరించిన రేట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజువారీ కూలి రూ. 245 నుంచి రూ. 257 లకు పెరిగింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అందుకు నోటిపికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2018-19లో రూ. 205, 2019 20లో రూ. 211, 2020- 21లో రూ. 237, 2021- 22లో 245 రూపాయలుగా ఉన్న కూలిని 257 రూపాయలకు పెంచి కూలీలను ఉద్ధరించినట్లుగా ప్రచారం చేయటం వంచన మాత్రమే. ఐదు సంవత్సరాల కాలంలో ధరలు పెరుగుదల గమనిస్తే అసలు అది పెరుగుదలే కాదు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 4 నుండి 1.5% కి నిధులు తగ్గాయి. 2021లో నిధుల తగ్గింపు గణనీయంగా ఉంది. కేటాయింపుల్లో తగ్గింపులే కాకుండా పథకంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇప్పటికే వేసవి భృతి, మజ్జిగ వంటి అదనపు సౌకర్యాలకు కోత పెట్టింది. ఇక నుంచి రెండు పూటల పని విధానం అమలు చేయాలని, ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పని గంటలు ఉండాలని, అందుకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎండా కాలంలో పని చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు 25% అదనంగా కూలి చెల్లించాలి. ఈ పథకం మోడీ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిన తర్వాత వేసవి భృతిని రద్దు చేసింది. మోడీ ప్రభుత్వం నిర్ణయాలను కూలీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కూలీలు చేసిన పనిని కొలతల ఆధారంగా లెక్కించి రోజు కూలి నిర్ణయిస్తున్నారు. రోజంతా కష్టపడినా రూ. 150 నుంచి 190కి మించి కూలి లభించటం లేదు. దీన్ని గమనిస్తే కేంద్ర ప్రభుత్వ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి రేట్ల వంచన వెల్లడవుతున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గుతున్నదని అనేక మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు ఎక్కువగా ఫిబ్రవరి నుంచి జరుగుతాయి. ఆ నెల నుంచే ఎండలు ప్రారంభం అవుతాయి.

ఎండల నుంచి ఉపశమనం పొందటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని చట్టంలో పేర్కొన్నా అలాంటి ఏర్పాట్లు ఎక్కడా జరగలేదు. పనికి వచ్చే స్త్రీలకు చిన్న పిల్లలు ఉంటే వారి రక్షణకు పని చేసే చోట తగిన ఏర్పాట్లు చేయాలి. కూలీలకు మంచి నీళ్లు అందుబాటులో ఉంచాలి, ఆ ఏర్పాటు లేవు. పని చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స చేయటానికి అవసరమైన పరికరాలతో పాటు మందులు ఉండాలని చట్టంలో చెప్పినా అవి కన్పించవు. ఫలితంగా కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2019 -20లో 81,09,832 జాబ్ కార్డుల ఇస్తే 78,95,977 మందికే పని కల్పించారు. ఈ పనులు కూడా 32.95 రోజులు మాత్రమే కుటుంబానికి పని దొరికాయి. వంద రోజులు పని దొరికిన కుటుంబాలు 4,152 మాత్రమే. కూలీలకు లభించిన సగటు కూలి 192 రూపాయలు. ఇది చాలా తక్కువ కూలి. రాష్ట్రంలో వ్యవసాయ కూలీల కనీస చట్టంలో పేర్కొన్న రోజు కూలి కన్నా చాలా తక్కువ. 2021 సంవత్సరంలో రాష్ట్రం లో వ్యవసాయ పనుల ద్వారా రోజు కూలి రూ. 414 లభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీన్ని గమనిస్తే ఉపాధి కూలీలు ఎంతగా శ్రమ దోపిడీకి గురవుతున్నది వెల్లడవుతున్నది. ఇటీవల ముఖ్యంత్రి జగన్ ఉపాధి కూలి 240 రూపాయలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఆ విధంగా ఉంటే వైసిపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చెబుతున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పనులు కల్పించడంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని 2022 జనవరిలో 2,84,03,516 పని దినాలు కల్పించామని చెప్పింది. మధ్యప్రదేశ్‌లో 2.06 కోట్ల, తెలంగాణలో 1.65 కోట్ల, బీహార్‌లో 1.48 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించబడ్డాయనే లెక్కలు చెబుతున్నది. కొన్ని రాష్ట్రాల కన్నా పని దినాల కల్పన ఎక్కువగా ఉన్నా ఉపాధి పథకం బాగా జరిగినట్లు కాదు. పని దొరకని వారు ఇంకా లక్షలాది మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ గ్రామీణ ఉపాధి పథకం పనులకు చాలా మంది పేదలు దూరంగా ఉన్నారు. 30 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉండగా, 60 లక్షల కూలీలు ఉపాధి హామీ పనుల జాబ్ కార్డులు పొందారు. వీరిలో 100 రోజులు పని దొరికిన కుటుంబాలు చాలా తక్కువ. పనులు చేసే చోట ఉండాల్సిన సదుపాయాలు ఎక్కడా కానరావు.

రోజు కూలి రూ. 257లకు పెంచినా ఆ కూలి లభించటం లేదు. సకాలంలో కూలీలకు వేతనాలు అందటం లేదు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ఉపాధి పనుల నిధులను ప్రభుత్వాలు ఇతర పనులకు మళ్ళిస్తున్నాయి. ఉపాధి పథకం అమలు చేసే అధికారులు కూడా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఫలితంగా నెలల తరబడి డబ్బులు అందక కూలీల కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నారు. భారత పాలకులు గ్రామీణ పేదల స్వతంత్ర ఆర్ధిక శక్తి పెరిగే విధంగా సమగ్ర భూ సంస్కరణల ద్వారా పేదలకు భూములు పంపిణీ చేయకుండా, వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే విధానాలు అమలు జరుపుతున్నది. అందులో భాగమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. స్వతంత్ర ఆర్ధిక శక్తి కోసం గ్రామీణ పేదలు భూమి కోసం ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News