ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో కొనసాగాలంటే, రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలకు శత్రువుల (తోటి ప్రజలు) నుండి ఆపద ఉన్నట్లు నమ్మించాలి. లేని శత్రువులను ఉన్నట్లుగా ప్రజలను భ్రమింప చేయాలి. మేము మీకు అండగా ఉంటామని చెప్తూ వారిని చెప్పుచేతల్లో పెట్టుకోవాలి. ప్రజలను ఎలా అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలో అడాల్ఫ్ హిట్లర్ తన ఆత్మకథ మెయిన్ కంప్ఫ్ (మై స్ట్రగుల్) లో చేసిన వ్యక్తీకరణ ఇది. చంపండి, కొట్టండి, అబద్ధాలు చెప్పండి, నాశనం చేయండి ఒకసారి మీరు విజయం సాధించిన తర్వాత ఎవరూ చేసేదేం ఉండదు అనేది ఫాసిస్ట్ హిట్లర్ పాటించిన నియంతృత్వ థియరీ. ఈ దురాలోచనలతోనే ఎన్నో దారుణాలకు ఒడిగట్టి, కరడుగట్టిన నియంతృత్వ విధానాలతో, జాత్యహంకారంతో మానవ హననానికి పాల్పడి ప్రపంచ చరిత్రలోనే అత్యంత దుర్మార్గునిగా అడాల్ఫ్ హిట్లర్ చరిత్రలో నిలిచాడు. నాటి రాచరిక పాలన నుంచి నేటి ప్రజాస్వామిక యుగంలోనూ కొన్ని స్వార్థపూరిత పాలక శక్తులు అనుసరిస్తున్న వ్యూహం ఇదే.
జాతి, మతం ఇలా చారిత్రకమైన అంశాలను తవ్వి తీసి, వాటికి పదును పెట్టి, ప్రజలను విడగొట్టి, మారణహోమం సాగించి, తమ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడమే నేటి రాజనీతిగా అలౌకిక పాలక శక్తులు వ్యవహరిస్తున్నాయి ప్రజలు ప్రశాంతంగా ఉంటే తమ హక్కులను ప్రశ్నిస్తారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తమకు సమకూరాల్సిన సౌకర్యాలను ఆశిస్తారు. వారిని నిత్యం అశాంతికి గురి చేయాలి. అలాగైతేనే ప్రజలు అభద్రతకు, అస్థిరత్వానికి లోనవుతూ రాజకీయ నాయకులు చెప్పిందల్లా వింటరు. పాలకులకు లోబడి ఉంటారు. ప్రజల్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు నిరంతరం పాలకులుగా ఉండాలనే లక్ష్యంతో కుత్సిత పాలక శక్తులు అనుసరించే వ్యూహం ఇది. తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి నేడు మతాన్నిమించిన ఆయుధం లేదు. తమ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని భావించినపుడు, వారికి మతమౌఢ్యాన్ని ఆవహింపజేసి, ఏదో జరగబోతోందనీ, ఎవరో వారి పై దాడి చేయబోతున్నారనే నిత్యభయాందోళనలో వారిని ఉంచి, తాము మాత్రమే వారిని రక్షించగలమనే కపట నాటకాన్ని ప్రదర్శిస్తూ, ఆ భయాందోళనలను ఓట్లుగా మలుచుకొని మళ్ళీమళ్ళీ గద్దెనెక్కే ప్రయత్నాలు చేయడమే దీని వెనుకున్న అసలు రహస్యం.
ఆధ్యాత్మికతను, శాంతిపూర్వకమైన జీవన విధానాన్ని పెంపొందించే మతం నేడు కొందరు పాలకుల చేతుల్లో వినాశకాస్త్రంగా మారింది. తమ మతం ఉనికికి ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నదనీ, అందరూ ఏకమై ఎదుటి మతాన్ని నిలువరిస్తేనే తాము బతికి బట్టకట్టగలమనే అభూతకల్పనలను ప్రచారంచేస్తున్న పాలకులను నేడు మనం చూస్తున్నాం. మత పరిరక్షణే అంతిమ లక్ష్యమని జనాల్లో ఒక మతం వారికి మరో మతం వారిపట్ల ద్వేషం, అనుమానం, అసహనం అనే దుర్గుణాలను పురికొల్పుతున్న నాయకుల వలలోపడి అసలు తమకు ఏం కావాలో, తాము ఏం కోల్పోతున్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో జనం రాజకీయ నాయకులు ఆడించినట్లు ఆడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. జరిగింది ఒకటైతే, దాన్ని తమ అవసరాలను తీర్చుకునేలా, లక్ష్యాలను సాధించుకునేలా మరో రకంగా ప్రచారం చేస్తూ కొందరు రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటున్న తీరును నేడు మనం చూస్తున్నాం.
నాటి అఖండ భారతదేశం వందల, వేల ఏళ్ళుగా ఎన్నో మతాలను తనలో నిలుపుకుంది. కాలక్రమంలో హిందూ మతంతో పాటు బౌద్ధం, జైనం, సిక్కు, ఇస్లాం తదితర మతాలు ఈ భూమిలో అంతర్భాగమయ్యాయి. చారిత్రక క్రమంలో కొత్తకొత్త రాజ్యాలు పుట్టుకొచ్చి ఒక రాజ్యంపై మరొక రాజ్యం, ఒక రాజుపై మరొక రాజు ఆధిపత్యమే లక్ష్యంగా ఎన్నో యుద్ధాలు, మారణహోమాలు జరిగాయి. ఎవరికి బలముంటే వారిదే పై చేయి. ఒకరిపై ఒకరు, వారిపై ఇంకొకరు ఇలా ఆధిపత్యం కొనసాగుతూనే వచ్చింది. ఈ కోవలోనే ముస్లిం పాలకులు భారతదేశంపై దండెత్తి ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి, వాటిని కొల్లగొట్టి, కొన్ని ఆలయాల స్థానంలో మసీదులను కట్టిన సంఘటనలు, దేవాలయ మూలవిరాట్టును తమ రాజ్యానికి తరలించిన సంఘటనలు చరిత్రలో నమోదయ్యాయి. వీరే కాదు రాజ్యవిస్తరణ కాంక్షలో భాగంగా హిందూ రాజులు పరస్పరం ఇతర హిందూ రాజుల రాజ్యంలోని దేవాలయాలను కొల్లగొట్టడం, కొన్నిసార్లు దేవాలయం మూలవిరాట్టును తమ రాజ్యానికి తీసుకొని పోయిన దాఖలాలూ చరిత్రలో రికార్డయ్యాయి.
హిందూ రాజులు బౌద్ధ, జైనాలయాలను కొల్లగొట్టి తమ దైవాలను ప్రతిష్టించిన సంఘటనలు; బౌద్ధ, జైన మతాలను అవలంబించిన పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఘటనెలన్నో ఎన్నెన్నో ఉన్నాయి. ఇలా రాజ్య ఆక్రమణ, ఉనికి కాపాడుకునే క్రమంలో జరిగిన యుద్ధాలు, తిరుగుబాట్లను అణచివేసే క్రమంలో భాగంగా దేవాలయాల విధ్వంసాలు కొనసాగుతూ వచ్చాయి. చాలా వరకు జరిగిన ఆలయ విధ్వంసాల్లో యుద్ధోన్మాదాన్నే కానీ మతోన్మాదాన్ని చరిత్రకారులు నిర్ధారించలేదు. యుద్ధంలో ఓడిపోయిన ప్రత్యర్థికి గర్వభంగం కలిగించడమే మూలవిరాట్టును తమ రాజ్యానికి తీసుకుపోవడంలో ప్రధాన ఉద్దేశమని నాటి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు నాడు దేశంలో ముస్లిం పాలకుల ప్రాబల్యం పెరిగే కొద్దీ, వారు హిందూ మతాన్ని ఆదరించి, ఆలయాల నిర్మాణాలకు, ఉత్సవాలకు విరాళాలను ఇచ్చిన దాఖలాలున్నాయి. ముస్లిం పాలకుల ఆస్థానాల్లో హిందువులు గొప్ప గొప్ప పదవుల్లో నియమితులై రాణించారు. నాడు హిందూ, ముస్లింలు కలిసిమెలిసి పండుగలు చేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. గత కాలపు రాచరికపు చరిత్రను నేడు తమకు అనుకూలంగా తవ్వి పోస్తూ, ప్రజల ముందు అవాస్తవ రాశులను పేరుస్తూ విద్వేషాలను రగిల్చే కుట్రలు జరుగుతుండటం నిజం గా శోచనీయం.
నేటి ప్రజాస్వామిక యుగంలో గతకాలపు రాచరిక విధానాలను, విధ్వంసాన్ని ప్రామాణికంగా తీసుకొని నేడు ఒక మతంపై మరో మతం ద్వేషం పెంచుకోవాల్సిన, ద్వేషాన్ని నూరిపోయాల్సిన అవసరం ఏమిటన్నదే అసలు ప్రశ్న. మనిషి తనను తాను విశ్వమానవునిగా మలుచుకుంటున్న ప్రస్తుత తరుణంలో మతానికి తనను తాను పరిమితం చేసుకునేలా చేస్తున్న కుట్రల వెనుక పరమార్థం ఏంటని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఇది. రాచరికంలో నాటి పాలకులు సాగించిన దుశ్చర్యలను చూపి వర్తమానంలోనూ అదేధోరణిని కొనసాగిస్తామనటం ఎంతవరకు న్యాయం? దేవాలయాలను కూల్చి మసీదులు కట్టిన సంఘటనలు ప్రచారమైనంతగా, హైందవ, బౌద్ధ, జైన మతాలను పాటించిన రాజులు పరస్పరం ప్రత్యర్థి రాజుల ఆలయాలను కూల్చి తమ మతాలకు సంబంధించిన ఆలయాలు కట్టిన సంఘటనలకు ఎందుకంత ప్రచారం లభించలేదు? హైందవ శాఖలైన శైవ, వైష్ణవుల కలహాలు, గ్రామ దేవతల ఆలయాల స్థానంలో హైందవ దేవతల ఆలయాలు పురుడుపోసుకున్న సంఘటనలకు ఎందుకు ప్రాధాన్యత లభించలేదు?
నాడు ఎవరో ఏదో చేశారని నేడు పరస్పరం ఒకరి మతాన్ని మరొకరు ఈసడించుకోవడం తర్కబద్ధమైనదేనా? ఇప్పటికే రకరకాల సమస్యలతో సతమతమవుతున్న దేశానికి మతంఅనే ఒక అంశం అన్ని సమస్యలనే తీర్చే సంజీవిని ఔషధామా? మతాన్ని ఉద్ధరించడం నేడు దేశానికి తక్షణ అవసరమా? అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందని లౌకిక దేశంగా ప్రకటించబడిన భారతదేశంలో రాజ్యాంగ సూత్రాలు, చట్టాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని భావించినప్పుడు ఒక మతానికి ముంచుకొస్తున్న ప్రమాదమేమున్నది? లేదా ఆ దిశగా అమలవుతున్న చట్టాల అమలు తీరు సరిగా లేదనీ, పాలకులు అసమర్థులని అర్థం చేసుకోవాలా? గతంలో స్వార్థ ప్రయోజనాల కోసం మతం మాటున జరిగిన మారణ హోమాలను మనం మరిచిపోగలమా? మతం రొచ్చులో పడి కొట్టుకుపోతూ, మానవత్వాన్ని మరిచి, ద్వేషంతో రగిలిపోతూ మత కల్లోలాకు మరోసారి దేశం వేదికైతే జరిగే నష్టాన్ని ఊహించగలమా?
నేడు దేశంలో మత విద్వేషం ఒక మతానికే పరిమితమా? మనం అలా పొరపడినట్లైతే దాన్ని మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. అది ప్రజాస్వామ్య విలువలకూ, ప్రజాస్వామ్య హక్కులకు ప్రమాదకారిగా పరిణమించే పరిస్థితులకు దారితీస్తుంది. ప్రాణాంతక వైరస్ శరీరంలోకి ప్రవేశించి ఒక్కో అవయవాన్ని నాశనం చేసినట్లుగానే, సకాలంలో మేల్కొనకపోతే మత విద్వేషమనే అవలక్షణం యావత్ భారతజాతిని నిర్వీర్యం చేస్తుంది. మతవిద్వేషం మనల్ని కబళించక ముందే ప్రజాతంత్ర విలువలను రక్షించుకునేందుకు మనం సన్నద్ధం కావాలి. ఇప్పటికే మత సహనం విషయంలో భారతదేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో మసకబారుతున్నది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవడానికి చేయిచేయి కలపాలి.