Monday, December 23, 2024

ప్రమాణం చేయడానికి నేను రెడీ: రోహిత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ న్యూస్ : బిజెపి నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని తాండూరు నియోజకవర్గం శాసనసభ్యుడు పైలట్ రోహిత్‌రెడ్డి సవాల్ విసిరారు. అలా రుజువు చేస్తే తన పదవికి అప్పటికప్పుడే రాజీనామా చేస్తానని అన్నారు.బిజెపి నేతలు కేవలం తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అన్ని రాజకీయా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అందులో భాగంగనే తనపై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తనపై చేసిన ఆరోపణలకు బిజెపి నేతలు కట్టుబడి ఉంటే ఆదివారం ఉదయం 10 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీఅమ్మ వారి ఆలయానికి రావాలని శనివారం పైలట్ రోహిత్‌రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే. కర్నాటక కేసుపై ప్రమాణం చేయడానికి తనతో పాటుగా బండి సంజయ్ కూడా ఆలయానికి రావాలన్నారు. సవాల్ విసిరినట్లుగా రోహిత్ రెడ్డి నేడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. కర్నాటక పోలీసులు తనను ఎప్పుడూ విచారణకు పిలువలేదన్నారు.

ఏ ఎఫ్‌ఐఆర్‌లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు. ఆ విషయంలో తాను ఏ దేవాలయానికి రమ్మన్నా వస్తానని….ఎక్కడ ప్రమాణం చేయమన్న చేస్తానని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు బిజెపి నేతలు సిద్దమేనా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ బిజెపి నేతలు పదేపదే తనపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. కేంద్రంలో ఉన్నామన్న అహంతో దర్యాపు సంస్థలపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రతిపక్షలకు చెందిన నాయకులపై ఇడి, సిబిఐ, ఐటి దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.

బిజెపి అనుకూలంగా లేనివారిని నాయకులను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేయిస్తోందన్నారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేకు…ఎటువంటి అక్రమాలకు పాల్పడ లేదన్నారు. కాగా బండి సంజయ్‌కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావుకు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పటాన్‌చెరు ప్రాంతంలోని పరిశ్రమల యజమానులను బెదిరించలేదా? అని నిలదీశారు. స్టార్ హోటళ్లలో సంవత్సరం పొడవునా రూమ్స్ పెట్టుకొనే స్థాయికి ఎలా వచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని ఒక మహిళా నీ (రఘునందన్‌రావు) వద్దకు వస్తే నాగు పాములాగా కాటేయ లేదా? అని రోహిత్‌రెడ్డి నిలదీశారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంఐఎం నేతలతో టచ్‌లో ఉన్నదని వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News