అనుమానితులను విచారిస్తున్న పోలీసులు
చెరువులో ఇందు చెప్పులు గుర్తించిన బంధువులు
పోలీసులకు సమాచారం ఇచ్చిన తల్లిదండ్రులు
మనతెలంగాణ/జవహర్‌నగర్ : అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక ఇందు మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పలువరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలకు గురువారం వెళ్లిన అంబేద్కర్‌నగర్‌కు చెందిన విద్యార్థి ఇందు(10) కన్పించకుండా పోయి శుక్రవారం ఉదయం అనుమానాస్పదస్థితిలో అంబేద్కర్‌నగర్ చెరువులో శవమై తేలిన ఘటన తెలిసిందే. ఈ సంఘటనలో తల్లిదండ్రులు, స్థానికులు చెరువు కట్టపై ఉంటూ గంజాయి సేవిస్తున్న వారిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడ గంజాయి సేవించే వారి వివరాలు తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాచకొండ పోలీసులు జవహర్‌నగర్ పరిధిలో గంజాయి వినియోగిస్తూ సరఫరా చేస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకోని వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి,10 మొబైల్స్,రూ.13,100 నగదు,ద్విచక్రవాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. చిన్నారి ఇందు మరణం వెనుక వీరి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంబేద్కర్‌నగర్‌లో చాలామంది గంజాయి మత్తుకు బానిసగా మారినట్లు గుర్తించారు. బాలిక దగ్గరి బంధువులు కూడా గంజాయి సేవిస్తున్నారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిసింది. వీరి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. బాలిక ఇందు కుటుంబ సభ్యులు అంబేద్కర్‌నగర్ చెరువు వద్దకు ఆదివారం వెళ్లి మరోసారి వెళ్లి పరిశీలించారు. దీంతో చెరువు సమీపంలో ఇందు కాళ్ల చెప్పులు నీటిలో తేలి ఉండటంతో బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
చంపి చెరువులో పడేశారా…?
బాలిక ఇందును నిందితులు చంపివేసిన తర్వాతే చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. గురువారం బాలిక ఇందు కన్పించకుండా పోతే శుక్రవారం ఉదయం చెరువులో శమమై తేలింది. అంతేకాకుండా బాలిక మృతదేహం సెల్లింగ్ లేకుండా మామూలుగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ బాలిక కనుక ప్రమాదవశాత్తు చెరువులో పడితే ఇరవై నాలుగు గంటలు గడిస్తే కాని పైకి తేలే అవకాశం లేదు, ఆదివారం ఉదయం ఇందు తల్లిదండ్రులు చెరువు వద్ద వెతుకగా రెండు చెప్పులు వేర్వేరు ప్రాంతాల్లో లభించాయి. దీనిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందితే కట్టపై వేర్వేరు ప్రాంతాల్లో రెండు చెప్పులు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు.
అంబేద్కర్‌నగర్ చెరువు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా …
అంబేద్కర్‌నగర్ చెరువు కట్ట గంజాయి తాగేవారికి, విక్రయించే వారికి అడ్డాగా మారినందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో పలువురికి దీనిపై ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జనాలు ఎక్కవగా తిరగకపోవడంతో దమ్మాయిగూడ,అంబేద్కర్‌నగర్, సాయినగర్, కార్మికనగర్‌కు చెందిన గంజాయి బ్యాచ్ ఉదయం నుంచే ఇక్కడే తిష్టవేసి మత్తులో తేలుతారు. ఈ విషయమై గతంలో పలుమార్లు పోలీసులు చర్యలు తీసుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు కల్లుపాక, బార్ షాప్ కూడా చెరువు సమీపంలోనే ఉండటంతో నిత్యం మందుబాబులు కట్టపై తిష్టవేసి వచ్చిపోయేవారిపై దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.