Friday, December 20, 2024

గుజరాత్‌లో ఎద్దు నుంచి పాలు పితికినట్లుంది: అరవింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 14 శాతం ఓట్లను గెలవడంపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అక్కడ కేవలం 5 సీట్లు మాత్రమే గెవడంతో ‘ఎద్దు నుంచి పాలు పితినట్లు ఉంది’ అన్నారు. కపషేరలో ఆదివారం కాలిస్టా రిసార్టులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన ఈ ప్రకటన చేశారు.

“ఒక్క ఏడాదిలో మేము పంజాబ్‌లో గెలిచాము. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి) గెలిచాము. మాకు గోవాలో ఇద్దరు ఎంఎల్‌ఏలు ఉన్నారు. గుజరాత్‌లో ఐదుగురు ఎంఎల్‌ఏలతో 14 శాతం గెలిచాము. గుజరాత్‌లో తమ గెలుపుపై ఒకరు తాము ఎద్దు నుంచి పాలు పితికినట్లు వ్యాఖ్యానించారన్నారు. ప్రతి ఒక్కరు ఆవు నుంచి పాలు పితుకగలరు. కానీ మేము ఎద్దు నుంచి పాలు పితికాము” అని చలోక్తి విసిరారు. కాగా “2027లో గుజరాత్‌లో మేము మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము” అని ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదాను చేజిక్కించుకున్నాక ఆదివారం మొదటిసారి ఆయన తమ పార్టీ జాతీయ మండలి, జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు నిర్వహించారు. ఆప్ పార్టీ నాయకులు వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు, తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలను కోరారు. ఆయన మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జవానుల ప్రాణాలకు ప్రభుత్వం విలువనివ్వడంలేదు అన్నారు. భారత భూభాగంలోకి గత వారం చైనా సైనికులు రాకుండా భారత జవానులు నిరోధించారన్నారు. ఇరుపక్షాల సైనికులకు ఈ సందర్భంగా గాయాలయ్యాయని ప్రభుత్వం తెలిపింది. 2020 జూన్ తర్వాత చైనా, భారత్ జవానులు తలపడ్డం ఇప్పుడేనని పేర్కొన్నారు. లడఖ్‌కు చెందిన గల్వాన్‌లో ఇదివరకు బాహాబాహీకి దిగినప్పుడు 20 మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ స్థితిలో కేజ్రీవాల్ మాట్లాడుతూ “ చైనా వస్తువులను ఎవరు కొంటున్నారు? చైనా వస్తువులను కొనడంలో బిజెపికున్న తప్పనిసరి పరిస్థితులేమిటి? మనం దేశీయ ఉత్పత్తులను పెంచలేమా? మన దేశంలో తయారయ్యే వస్తువులున్నా…చైనా వస్తువులను కొంటున్నాము” అని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఇంకా “ప్రభుత్వం భారతీయులను దేశం నుంచి తరిమేస్తోంది, చైనా వారిని హత్తుకుంటోంది. భారతీయ వర్తకులు, పారిశ్రామికవేత్తలు దేశం వదిలి వెళ్లిపోతున్నారు” అని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News