లక్నో: కంటెయినర్ వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డంకౌర్ ప్రాంతంలో ముందు వెళ్తున్న కంటెయినర్‌ను ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందగా పది మంది గాయపడ్డారు. క్షతగ్రాతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. చలికాలంలో తెల్లవారుజామున మంచుగా ఎక్కువగా కురుస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.