రాచకొండ: నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిస్సా నుంచి తెలంగాణకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ఇటీవల ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేసి మూడు కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఒడిస్సా లోని కటక్ లో నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించింది. కోటి రూపాయలు విలువైన 20వేల లీటర్ల నకిలీ విస్కీని సీజ్ చేశారు.
ఒడిస్సా లో తయారుచేసి తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ మద్యాన్నిముఠా విక్రయిస్తున్నట్టు గుర్తించారు. తెలంగాణ నకిలీ లేబుల్ షీట్లు, తయారీ సామాగ్రి, భారీగా నకిలీ మద్యం సీజ్ చేశారు. ఇప్పటికే కేసులో 26 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. శివారెడ్డి, బాలరాజుగౌడ్, సంజయ్ కీలక నిందితులకు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. మునుగోడు ఎన్నికలకు తెలంగాణ బ్రాండ్ పేరుతో ఈ ముఠా నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్టు గుర్తించారు. ఒడిస్సా లో ఉన్న నకిలీ మద్యం స్థావరంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయడంతో పాటు ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.