Monday, January 20, 2025

కెసిఆర్ తోనే గిరిజనులకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్ల గిరిజన తండాలకు మహర్దశ వచ్చిందని, 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులకు అధికారాన్ని కట్టబెట్టిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.  వరంగల్ జిల్లా సంగెం మండలంలోని బిక్కోజి నాయక్ తండా నుండి బాలునాయక్ తండా వరకు 2 కోట్ల 68 లక్షల రూపాయలతో బి.టి. రోడ్డు నిర్మాణము పనులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ఇప్పటికే తండాలు గ్రామపంచాయతీల ఏర్పాటుతో గిరిజనుల ఆత్మగౌరవం పతాక స్థాయికి చేరిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. మన సిఎం కెసిఆర్  గిరిజన తండాల అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని, గత పాలకుల నిర్లక్ష్యంతో తండాలు అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు.

కానీ స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పల్లెవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని, దేశ రాజధాని ఢిల్లీలో, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటలు విద్యుత్‌ సరఫరా లేదన్నారు. దేశంలో తెలంగాణలో మాత్రమే 24 గంటల విద్యుత్‌ సరఫరా అందుతుందని, రోడ్లపైన ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్న ప్రతిపక్షనాయకులకు నిజంగా దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని సత్యవతి ప్రశ్నించారు.

బిజెపి నాయకుల కల్లబొల్లి కబుర్లతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న ఆ పార్టీ నాయకుల మాటలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. త్వరలోనే రైతుబంధు నిధులు విడుదలవుతాయని, రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, కల్యాణలక్ష్మి ద్వారా అందిస్తున్న 100116 పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసా కలిగిస్తుందని, తెలంగాణ తరహాలో దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ జరగడం లేదని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బిడి కార్మికులు ఇతర వర్గాల వారికి పెన్షన్లను పంపిణీ చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని సత్యవతి అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని, తెలంగాణాలో కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పాలనకు మద్దతుగా నిలువాలని కోరారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వకాడే, సర్పంచ్ విద్యారాణి, ఎంపిపి కళావతి, ఎంపిటిసి పద్మ, జడ్పిటిసి సుదర్శన్ రెడ్డి, డిఆర్డిఎ పిడి వసంత్ రావు, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత, రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, మరియు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News