ముంబై: ‘రాజ్యపాల్ హటావో,మహారాష్ట్ర బచావో’, ‘ఈడి సర్కార్, హాయ్ హాయ్’, ‘పన్నాస్ ఖోకే, ఎక్డుం ఓకే’ అంటూ మహా వికాస్ అఘడి(ఎంవిఎ) మంగళవారం నిరసన ప్రదర్శించింది. నాగ్‌పూర్‌లోని విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో ఏక్‌నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారీ నిరసన నిర్వహించారు. ముఖ్యమంత్రి షిండే రాజీనామా చేయాలని ప్రతిపక్ష ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు డిమాండ్ చేశారు. ఆరు నెలల క్రితం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని ఎంవిఎ ప్రభుత్వాన్ని బిజెపి మద్దతుతో షిండే కూల్చేశారన్నది ఇక్కడ గమనార్హం.
తిరుగుబాటుల ఎంఎల్‌ఎలకు షిండే నేతృత్వం వహిస్తున్నారు. ఆయన వర్గంను ఇప్పుడు బాలాసాహెబాన్చీ శివసేన అని పిలుస్తున్నారు. అందులో 40 మంది శివసేన ఎంఎల్‌ఎలు, 10 మంది స్వతంత్ర, చిన్న పార్టీల ఎంఎల్‌ఎలు ఉన్నారు. థాక్రే వర్గంలో శివసేనకు చెందిన 16 మంది ఎంఎల్‌ఎలు ఉన్నారు. విధాన్ భవన్ కాంప్లెక్స్‌లో ఎంవిఎ నిర్వహిచిన సమావేశానికి ఉద్ధవ్ థాక్రే అధ్యక్షత వహించారు. ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్, అంబాదాస్ దన్వే, కాంగ్రెస్ శాసనపక్షం నాయకుడు బాలాసాహెబ్ థోరత్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.