న్యూఢిల్లీ: చైనా, జపాన్, అమెరికా, క్షిణ కొరియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రోజువారీ పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌తో కొత్త వేరియంట్ల్లను సకాలంలో గుర్తించవచ్చని, అలాగే అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టడానికి వీలవుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాశారు.
ప్రస్తుతం దేశంలో వారానికి సగటున 1200 కేసులు, ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నాయని భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. వ్రైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకున్న అందంచెల వ్యూహం కారణంగా కొవిడ్ కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ తదితర దేశాల్లో ఒక్కసారిగా కేసులు పెరుగుతున్న దృష్టా వివిధ వేరియంట్లను గుర్తించడానికి పాజిటివ్ కేసుల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన ఆ లేఖలో తెలిపారు. ఈ దృష్టా ప్రతి రోజూ వీలయినంత వరకు అన్ని పాజిటివ్ కేసుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాల్సిందిగా రాష్ట్రాలను కోరుతున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆ లేఖలో పేర్కొన్నారు.