జగిత్యాల: మద్యం మత్తులో యువకులు కారు నడుపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న రెండు స్కూటీలను ఢీకొట్టిన సంఘటన బుధవారం రాత్రి జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. నలుగురు యువకులు మద్యం సేవించి అతివేగంగా కారు నడుపగా జగిత్యాల పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న రెండు స్కూటీలను ఢీకొట్టడంతో పాటు పక్కనే ఉన్న టెలిఫోన్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
కారులో బీరు సీసాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం తో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చేశారు. కారులో ఉన్న నలుగురు యువకుల్లో ఇద్దరికి కాళ్లు విరిగాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.