సిటీబ్యూరో: తన వారిపై బురద నీళ్లు పడేసిన బెంజ్ కారు యువకుడిని ప్రశ్నించిన యువతిని కారుతో ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. ఈ అమానవీయ సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎర్రగడ్డకు చెందిన సయ్యద్ సైఫుద్దీన్, తన భార్య మారియా మీర్ (25), సయ్యద్ సోదరులు సయ్యద్ మిరాజుద్దిన్, రాషెద్ మాషా ఉద్దిన్ కలిసి ఈ నెల 18వ తేదీన రెండు బైక్‌లపై ఎర్రగడ్డ నుంచి మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్తున్నారు. రెండు బైక్‌లపై బాధితులు ఎఐజి ఆస్పత్రి సమీపంలోకి రాగా అదే సమయంలో జూబ్లీహిల్స్‌కు చెందిన రాజసింహారెడ్డి (26) బెంజ్ కారు నంబర్ ఎపి 09 ఎం 0001లో వెళ్తున్నాడు. రోడ్డుపై ఉన్న నీటి గుంత నుంచి కారును పోనివ్వడంతో మిరాజుద్దిన్, రాషెద్ మాషా ఉద్దిన్‌పై బురద నీళ్లు పడ్డాయి.
దీంతో వారు కారును ఛేదించి చూసుకొని డ్రైవింగ్ చేయాలని కనీసం సారీ చెప్పకుండా వెళ్తున్నావని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు యువకులు రాజసింహారెడ్డిని దూషించారు. దీంతో ఆగ్రహం చెందిన రాజసింహారెడ్డి వారిని కారుతో వెంబడించి ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా సయ్యద్ సైఫుద్దీన్, అతడి భార్య మీర్‌ను కూడా వెంబడించి కారుతో ఢీకొట్టడంతో మారియా మీర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఎఐజి ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కారును సీజ్ చేశారు.