‘కో-విన్’ లో కూడా లభించనుంది!
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీనిని చేర్చినట్లు గురువారం అధికార వర్గాలు తెలిపాయి. సూది లేకుండా ఇచ్చే ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ సెంటర్లలో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా దీనిని శుక్రవారం సాయంత్రం కో-విన్ ప్లాట్‌ఫారమ్‌పై పెట్టనున్నట్లు వారు తెలిపారు.
ముక్కు ద్వారా ఇచ్చే ఈ నాసల్ వ్యాక్సిన్ బిబివి154కు నవంబర్‌లోనే భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో దీనిని అత్యవసర పరిస్థితిలో, 18 ఏళ్లపైబడిన వారికి మాత్రమే ఓ వైవిధ్య బూస్టర్ మోతాదు(హెటెరోలోగూస్ బూస్టర్ డోస్)గా ఉపయోగించేందుకు పరిమితి చేశారు. చైనా తదితర దేశాలలో ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల ఈ వ్యాక్సిన్‌కు ఇప్పుడు అందరికీ ఇచ్చేందుకు ఆమోదం ఇచ్చారు. ఇదిలావుండగా ప్రజలంతా మాస్కులు తప్పనిసరి ధరించాలని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హెచ్చరించారు. అంతేకాక నిఘా చర్యలు పెంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారి కోసం విమానాశ్రయాలలో నిఘా పెంచాలని హెచ్చరించారు.